RS Praveen Kumar | తమను హౌస్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘాటుగా స్పందించారు. పొద్దున్నే సంక్రాంతి పండుగ పూట రేవంత్ రెడ్డి సర్కార్ తమ అపార్ట్మెంట్ ముందు మళ్లీ పోలీసులను మోహరించిందని విమర్శించారు. ఎందుకు వచ్చిండ్రు అని వచ్చిన పోలీసులను అడిగితే పాడి కౌశిక్ రెడ్డి కోసం మేమేమైనా పోరాటం చేస్తమని మా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని అంటున్నరని తెలిపారు. అవును బరాబర్ పోరాటం చేస్తామని.. అది తమ బాధ్యత అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ గూండాల లాగా విధ్వంసం చేసే సంస్కృతి తమకు లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికి ఎన్నోసార్లు తనను గృహ నిర్బంధంలో ఉంచారని సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. హైదరాబాద్‌లో తనకు సొంత ఇల్లు కూడా లేదని.. అద్దెకు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నానని చెప్పారు. ప్రతిసారి తమ ఇంటికి పోలీసులు వచ్చి హడావుడి చేయడం వల్ల ఆ కాంప్లెక్స్‌లోని మిగతా కుటుంబాలు చాలా ఆందోళనకు, తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వాళ్లంతా తనపై సానుభూతి చూపిస్తున్నారని తెలిపారు. రేవంత్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు వారి గొంతుకగానే పోరాడుతూనే ఉంటామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మేం మారం. మీరు మారుతరన్న నమ్మకం కూడా మాకు లేదని అన్నారు. ఈ యుద్ధానికి విరామం లేదని తెలిపారు. మిగతా అపార్ట్మెంట్ వాసుల స్వేచ్ఛ, జీవించే హక్కులను దృష్టిలో ఉంచుకుని నాకు మీ ప్రభుత్వమే ఒక ఇంటిని కేటాయించి కిరాయి మీరే కట్టుకోండి లేదా చీటికి మాటికి మీ పోలీసులను మా అపార్ట్‌మెంట్‌కు పంపించడం మానేయండని సెటైర్ వేశారు.