హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ చెత్త కేసును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌ను ఇష్టమొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ మెప్పుకోసమే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చిల్లరమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేమెం ట్ కోటాలో ఎంపీ అయిన ఆయనకు పదేండ్లు మంత్రిగా పనిచేసిన ఉద్యమ నేత కేటీఆర్‌ను విమర్శించే అర్హతలేదని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో రావుల విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై అడుగడుగునా ప్రశ్నిస్తున్న కేటీఆర్‌పై కాం గ్రెస్ తప్పుడు కేసు పెట్టి పైశాచికానందం పొందుతున్నదని విరుచుకుపడ్డారు.
రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రేవంత్‌పై ఆరోపణలు గుప్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇప్పుడు సీఎం మోచేతి నీళ్లు తాగేందుకు బీఆర్ఎస్ నేతలపై పిచ్చికూతలు కూయడం విడ్డూరమని నిప్పులుచెరిగారు. రేవంత్ సర్కారు ఏడాది పాలనలో తెచ్చిన రూ.1.40 లక్షల కోట్ల అప్పుల్లో వాటాలు పంచుకొనేందుకే మంత్రులు కేసీఆర్, కేటీఆర్‌పై దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. సర్కారు ఒత్తిడితోనే కేటీఆర్‌పై ఏసీబీ కేసు పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్కు న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకమున్నదని, కేటీఆర్ క్లీన్‌చిట్‌తో బయటపడుతారని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడబోమని రోజూ ప్రజాసమస్యలు, హామీలపై నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.