నిర్మల్, మే 7 (నమస్తే తెలంగాణ): బాసరలో ఒక వ్యక్తి ఆశ్రమం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నా.. నిర్వాహకులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గనేత డాక్టర్ పడకంటి రమాదేవి ప్రశ్నించారు. వేదపాఠశాల పేరుతో అక్కడ జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలపై మీడియాలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఆమె బుధవారం ప్రకటన విడుదల చేశారు. బాసర లాంటి పుణ్యక్షేత్రంలో ఓ వ్యక్తి విద్యానందగిరిస్వామి పేరుతో చలామణి అవుతూ వేద పాఠశాలను ప్రా రంభించారని చెప్పారు. గోదావరి హారతి పేరిట పూజలు నిర్వహించి, పుష్కరఘాట్ స్థలాన్ని కబ్జా చేయడమే కా కుండా, భక్తుల నుంచి పూజల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు కూడా వస్తున్నాయని తెలిపారు. పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తానంటూ భక్తులను తప్పుదోవ పట్టిస్తూ అమ్మవారి ప్రతిష్ఠను విఘాతం కలిగిస్తున్నాడని చెప్పారు. ముథోల్ నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఆశ్రమంలో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి, శ్రీవేదభారతి పీఠం లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.