హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ‘ఎవరు ఎవర్ని మోసం చేశారు.. ఎవరివల్ల ఎవరికి లాభం జరిగిందనేది ఆ దేవుడికి తెలుసు. 2019లో మిమ్మల్ని వదిలి పార్టీ మారామనేది మీ బాధయితే, మిమ్మల్ని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చామన్న అక్కసుతో ఆ పార్టీలోని కొందరు పెద్దలు నన్ను, మా అమ్మను నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నించినప్పుడు మీరెక్కడున్నారు అన్నా’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘అందరికీ రేవంత్ మా అన్న’ అని చెప్పుకున్న. మాకు అండగా ఉండాల్సిన సమయంలో అనాథగా వదిలి వెళ్లింది మీరు కాదా? 2018లో నా రాజకీయ భవిష్యత్తు కోసం మాటసాయం చేయాలని వేడుకుంటే ‘నా చేతిలో ఏముంది’ అని చెప్పి నా గుండెకు మానని గాయం చేసింది మీరు కాదా?’ అని నిలదీశారు. పార్టీలు మారినా రేవంత్‌రెడ్డి ఎప్పుడూ బాగుండాలని కోరుకున్నామే తప్ప తన నాశనాన్ని కోరలేదని, రేవంత్‌రెడ్డికి కలిగిన బాధకంటే రెట్టింపు బాధ తమకు కలిగిందని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు.
అహంకారానికి నిదర్శనం: గజ్జెల నగేశ్
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్ విమర్శించారు.