హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు ఓ చట్టాన్ని తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా ? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం నామా ఈ మేరకు ఒక ప్రశ్న వేస్తూ.. 2021, డిసెంబర్లో రైతులు ఆందోళన చేసిన సందర్భంగా కేంద్రం ఎంఎస్పీ చట్టం తెస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు చట్టం తేలేదని అన్నారు. దీనికి మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం పట్ల నామా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తానడిగిన ప్రశ్నకు మంత్రి సూటిగా సమాధానం ఇవ్వలేదని, చట్టం ఎప్పుడు తీసుకువస్తారో వెల్లడించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న విజ్ఞప్తిపై సైతం సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు.
మంత్రి సమాధానంపై నామా అసహనం
సభ్యులడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని నామా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎకనామిక్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ సార్టప్ బై ఉమెన్ పథకానికి సంబంధించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ప్రశ్న ఒకటైతే, సమాధానం వేరొకటి ఇచ్చారని మండిపడ్డారు. డబ్ల్యూఈఈ పథకం కింద మహిళల ఆర్థికాభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నామా కోరారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఏదేదో చెప్పుకొచ్చారని విమర్శించారు.