హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): జాతీయ భద్రత కోసమే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ప్రధానిగా మన్మోహన్సింగ్ ఉన్నప్పుడు ప్రకటించారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ తెలిపారు. యూపీఏ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు మన్మోహన్సింగ్ ఒప్పుకున్నారని, మరి దానికి ఎవరు బాధ్యులని, ఎవరిని జైల్లో పెట్టాలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ గురించి బహిరంగసభలో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం క్రిషాంక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ.100 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కేసీఆర్‌ను తిట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. దీనిని బట్టి వారిలో కేసీఆర్ భయం ఎంత ఉన్నదో ఆర్థం అవుతున్నదని చెప్పారు. రాహుల్ ఎప్పుడైనా సెల్ఫ్ గోల్ చేసుకోగల సమర్థుడని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలు, ఎండిపోతున్న పంటల నుంచి దృష్టి మరల్చడానికి, 100 రోజుల్లో చేసిన పనుల గురించి ఏమీ చెప్పుకోలేక కేసీఆర్‌పై రాహుల్‌గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం వెబ్‌సిరీస్ నడిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి ఈడీ, కాంగ్రెస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ దొరికాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో పది లక్షల ఫోన్లను ట్యాప్ చేస్తే పది లక్షల ఆఫీసులు కావాలి కదా.. ఎన్ని ఆఫీసులను సీజ్ చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవసరమని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పారని అంటూ.. అప్పటి వీడియోను క్రిషాంక్ ప్రదర్శించారు. రాహుల్‌గాంధీ ఫోన్‌ట్యాపింగ్‌పై సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
నిష్పక్షపాతంగా విచారణ జరగాలి
ఫోన్‌ట్యాపింగ్‌పై రాజకీయ విచారణ కాకుండా నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేయాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. ట్రాయ్, పోలీసు ఉన్నతాధికారులను విచారణకు పిలవాలని అన్నారు. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై హరిరామజోగయ్య ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను నిరాధారనమైనవిగా కొట్టివేశారని, శివధర్‌రెడ్డి, రవిగుప్తాను ఈ కేసులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసు అధికారులను టార్గెట్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వం, కేసీఆర్‌పై ఆరోపణలే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. మొదట అరవింద్‌కుమార్‌ను టార్గెట్ చేశారని, ఆ తరువాత జయేశ్ రంజన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పెగాసస్‌తో బీజేపీ వాళ్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, దీనిపై రాహుల్‌గాంధీ మాట్లాడలేదని అన్నారు.