హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): తన సోదరుల దందాలను పెంచటం కోసమే 30 మంది బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. ఇప్పటిదాకా బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న రేవంత్ సర్కారు.. ఇప్పుడు తన తమ్ముడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నదని మండిపడ్డారు. తెలంగాణలో రూ.1,000 కోట్లతో పెట్టుబడి పెడుతామన్న స్వచ్ఛ్ బయో కంపెనీ రేవంత్‌రెడ్డి తమ్ముడు ఎనుముల జగదీశ్వర్రెడ్డిది అని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. ‘స్వచ్ఛ్ బయో కంపెనీ స్వచ్ఛంగా కనిపిస్తలేదు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయటానికా? గొప్ప పనిచేస్తున్నామని చెప్పటానికా? తమ్ముళ్లను సెటిల్ చేయటానికా?’ అని నిలదీశారు.
బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో క్రిశాంక్ మాట్లాడుతూ.. సీఎం అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ్ బయో కంపెనీతో రూ.1,000 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని.. ఆ కంపెనీ రేవంత్‌రెడ్డి కుటుంబానిది అని తెలిపారు. ఈ కంపెనీలో మొదటి డైరెక్టర్ వేదవల్లి శివానందరెడ్డి, రెండో డైరెక్టర్ (రేవంత్ తమ్ముడు) ఎనుముల జగదీశ్వర్‌రెడ్డి అని వెల్లడించారు. వేదవల్లి యూపీలో మెస్సే బార్ నడుపుతున్నారని, సీఎంతో ఎంవోయూ కుదుర్చుకున్నపుడు కంపెనీ ఇద్దరు డైరెక్టర్లు లేరని, హర్ష పసునూరి అనే వ్యక్తి సీఎం రేవంత్‌తోపాటు ఫొటోలో ఉన్నారని వివరించారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే హర్ష పసునూరి సీఎం సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి బినామీ అని తెలిపారు. తమ్ముడిని ఫొటోలో చూపించకుండా తమ్ముడి బినామీతో ఒప్పంద ఫొటోలు దిగారని విమర్శించారు. స్వచ్ఛ్ బయో కంపెనీ 15 రోజుల క్రితం (జూలైలో) ఏర్పాటైందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ లేఖ ద్వారా తెలిసిందని బహిర్గతం చేశారు.
ఆ కంపెనీకి రూ.1,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకునేంత సీన్ లేదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి 30 మంది సభ్యుల ముఠాతో అమెరికా వెళ్లింది తన సోదరుల వ్యాపారాలు పెంచడం కోసమేనా? బోగస్ కంపెనీలకు విలువైన తెలంగాణ భూములు కట్టబెట్టేందుకా అధికారం ఇచ్చింది? నీ తమ్ముడి కంపెనీతో వ్యాపారం చేయించటానికా సీఎం పదవి వచ్చింది? తమ్ముడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సీఎం రేవంత్ యూఎస్ దాకా వెళ్లాలా?’ అని నిలదీశారు. తమ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ్ బయో ఒప్పందంపై కాంగ్రెస్ నాయకులు స్పందించాలని అన్నారు. బోగస్ కంపెనీలతో రేవంత్ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు బోగస్ కంపెనీలని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, తాము చెప్తున్నవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నవేనని, ఎవరైనా చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డిది దండుపాళ్యం ముఠా
కేటీఆర్ యూఎస్ పర్యటన సందర్భంగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదిరేవి.. ఇపుడు బోగస్ కంపెనీలు వస్తున్నాయని క్రిశాంక్ ఆరోపించారు. కుటుంబపాలన, దండుపాళ్యం ముఠా రేవంత్‌పాలనలో చెలరేగుతున్నాయని ధ్వజమెత్తారు.