హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మూసీ మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్టును మెయిన్ హార్ట్‌కు అప్పగించడంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘రూ.3వేల కోట్ల కుంభకోణంలో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ అయిన ఆ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ కాంట్రాక్టు ఇచ్చింది’ అని ఎక్స్‌లో బుధవారం పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని కరాచీ న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను జతచేశారు. ఈ పోస్టును బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. కంపెనీకి ఆర్డర్ ఇచ్చే ముందు నిబంధనలు పాటించారో లేదో తెలుపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమపై వస్తున్న ఆరోపణలపై మెయిన్ హార్ట్ సంస్థ బుధవారం స్పందించింది. బీఆర్ఎస్ నేత చేసిన ఆరోపణలను ఖండించింది. పాకిస్థాన్‌లోని క్రిక్ మెరీనా ప్రాజెక్టుకు తాము కన్సల్టెంట్‌గా మాత్రమే వ్యవహరించామని స్పష్టం చేసింది. ఇతర లావాదేవీలతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని పేరొన్నది. తమపై ప్రచురించిన తప్పుడు వార్తలను వెనకి తీసుకోకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.