హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సోమ్ డిస్టిలరీస్ను రాష్ట్రంలోకి రానివ్వబోమని, ఆ కంపెనీపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పష్టంచేశారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా తాము దానిని రానివ్వబోమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సోమ్ బీరు కంపెనీకి క్షమాపణ చెప్పేదే లేదని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ తమను తెలంగాణలో అడుగుపెట్టకుండా చేసిందనే కక్షతో, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే భోపాల్ జిల్లా సెషన్స్ కోర్టులో సోమ్ డిస్టిలరీస్ తనపై పరువు నష్టం కేసు వేసిందని తెలిపారు. కేసులో పోరాడుతానని, ఎవరి బెదిరింపులకు లొంగబోనని స్పష్టంచేశారు. బుధవారం కోర్టుకు హాజరైన క్రిశాంక్ భోపాల్ నుంచి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 50 లక్షల జరిమానా చెల్లించాలని లేదా బేషరతుగా క్షమాపణ చెప్పాలని పిటిషన్లో కోరారని పేర్కొన్నారు. తాను 50 రూపాయలు కూడా ఇవ్వబోనని, క్షమాపణ చెప్పబోమని స్పష్టంచేశారు.
మధ్యప్రదేశ్లో ఆరోపణలు, కేసులు ఉన్న సోమ్ కంపెనీకి బీర్లు తయారీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిందని చెప్పారు. మధ్యప్రదేశ్ సీఎం కూడా ఈ కంపెనీపై ట్వీట్ చేశారని గుర్తుచేశారు. ఈ కంపెనీ ఉత్పత్తులు తాగడం వల్ల చాలామంది చనిపోయారని, ప్రజలకు కలిగే అనారోగ్యంపై అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారని చెప్పారు. తదుపరి విచారణ జనవరి 15వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు.