KTR | ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూలగొట్టడమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటు ఇవ్వకుండా కేసీఆర్‌కు అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయిండ్రు అన్నారు. ఎంతో మంది నిరుపేద, గరీబోళ్లను రోడ్లపైకి కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిందని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని.. నాకే వేస్తున్నారని రేవంత్ అనుకుంటాడన్నారు. నెల రోజులు గట్టిగా కొట్లాడుదామని.. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. నీ గుడ్లు పీకి గోటీలాడుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటానంటాడని విమర్శించారు.
హామీలపై ప్రశ్నిస్తే లంకెబిందెలు ఉంటాయనుకున్నానని అంటాడని.. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకు తెలుసునన్నారు. ఎన్నడూ ఇంత దివాళాకోరు మాటలు ఏ ముఖ్యమంత్రీ మాట్లాడలేదని.. అప్పు కోసం వెళితే దొంగలెక్క చూస్తున్నారని అంటున్నాడని.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెబుతున్నాడన్నాడని విమర్శించారు. పోయినసారి అజారుద్దీన్ పోటీ చేశారని.. టికెట్ అడుగుతారని ఎమ్మెల్సీ ఇచ్చి.. కోర్టులో నిలబడదని తెలిసీ షేక్‌పేట్ వద్ద ఖబ్రస్థాన్‌కు జాగా ఇచ్చారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో కొట్టే దెబ్బకు ఢిల్లీలో అధిష్టానం అదిరిపడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు నల్లా బిల్లులు రాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని అంటున్నారని.. ఒకే ఇంటిలో 43 దొంగ ఓట్లు రాయించిండ్రు.. మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించిండ్రని మండిపడ్డారు. నెల రోజులపాటుఇంటింటికీ బాకీ కార్డు పట్టుకుని వెళ్లాలని.. దొంగ ఓట్లు పడకుండా అందరినీ ఓట్లు వేసేలా ప్రోత్సహించాలని కోరారు. రాబోవు నెల రోజులపాటు కాంగ్రెస్‌పై వ్యతిరేకత పూర్తిస్థాయిలో.. ఓట్ల రూపంలో పడాలని అన్నారు.