Harish Rao | అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం హరీశ్‌రావు మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని రూ.2లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు అప్పుప చేసి, మిత్తితో సహా బ్యాంకులకు కట్టారని హరీశ్‌రావు తెలిపారు. తమకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందని వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని అన్నారు. కానీ ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి అసంబద్ధ ప్రకటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజలకు, రైతులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటుందని.. రుణమాఫీ హామీ అమలును ప్రణాళిక ప్రకారం అటకెక్కించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.