Sakala Janula Samme |స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన సకల జనుల సమ్మె జరిగి 14 ఏండ్లు కావస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం యావత్ తెలంగాణ ప్రజలు సింహాలై గర్జించిన రోజు నేడు అని అన్నారు. స్వరాష్ట్ర కాంక్షను సకల జనుల సమ్మె పేరిట ప్రపంచానికి చాటి చెప్పిన మహోజ్వల ఘట్టం నేడు అని అన్నారు.
సరిగ్గా 14 ఏండ్ల క్రితం ఇదే రోజున మొదలైన ‘సకల జనుల సమ్మె’ 42 రోజుల పాటు నిరవధికంగా కొనసాగిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ పిలుపుతో ప్రారంభమైన సమ్మె తెలంగాణ ఉద్యమ దిశను మలుపు తిప్పిందని.. స్వరాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిందని అన్నారు. సకల జనుల సమ్మెకు ముందు రోజున, కరీంనగర్ ‘జనగర్జన’ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని తెలిపారు. ‘సకల జనుల సమ్మెలో రేపటి నుంచి బస్సు పయ్య తిరగది, బడి గంట మోగది, సింగరేణిలో ఒక్క బొగ్గు పెల్ల కూడా పెగలదు, ఎక్కడ కూడా రైలు పోదు’ అని ఇచ్చిన పిలుపు అన్ని వర్గాల ప్రజలను ఉత్తేజపరిచింది. ఉద్యమ జ్వాలను రగిలించిందని చెప్పారు.