హైదరాబాద్ : ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్‌వన్ చేసిందే కేసీఆర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు తీరుపై, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్‌వన్ చేసినం అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నడని హరీశ్‌రావు విమర్శించారు. ‘ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్ వన్ ఎవరు చేసిండ్రు..? నువ్వా..?’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రాకముందే 2022-23 లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి, తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలబెట్టింది కేసీఆర్ అని చెప్పారు.
అప్పట్లో ఇన్ని ఒడ్లు మేం కొనలేం అని కేంద్రం చేతులు ఎత్తేస్తే తాము కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీకి పొయ్యి ధర్నాలు చేసినమని హరీశ్‌రావు చెప్పారు. 2020-21లో ధాన్యం సేకరణలో కూడా తాము రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని అన్నారు. ఆ ఏడాది తాము 141 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. రేవంత్‌రెడ్డి వచ్చినంక ఇంత ధాన్యాన్ని ఎన్నడూ సేకరించలేదని ఎద్దేవా చేశారు.
ఇక కాళేశ్వరం నీళ్లు లేకుండానే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపామన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కూడా హరీశ్‌రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే పంటలు పండుతున్నాయని చెప్పారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి ప్రాజెక్టుల కింద పండే పంటలు కాళేశ్వరం నీళ్లతోని పండుతున్న పంటలు కాదా..? అని ప్రశ్నించారు.
ఎక్కువ వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ నుంచి, మధ్యతరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడుతామని హరీశ్‌రావు వివరించారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిసోర్సెస్ అని చెప్పారు. గడిచిన రెండేళ్లుగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి మోటార్లు ఆన్‌చేసి రిజర్వాయర్లను నింపినమని, లక్షల ఎకరాలకు నీళ్లు పారించి పంటలు పండించినమని, అవన్నీ కాళేశ్వరం నీళ్లే అని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డీ.. ఎందుకు అన్ని చిల్లర మాటలు మాట్లాడుతవ్ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. నువ్వు రాకముందే తెలంగాణ నెంబర్‌వన్ అయ్యిందని అన్నారు. డాక్టర్లు ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్ చేసిందే కేసీఆర్ అని చెప్పారు.