వరంగల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ ఏ చిన్న నిరసన చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదా? పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పర్యటించటానికి వీళ్లేదు అన్నట్టు కక్షగట్టిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు గురువారం వరంగల్ పర్యటనపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరించిన వైఖరే అందుకు సాక్షీభూతంగా నిలుస్తున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల ధర్నాకు సంఘీభావం తెలిపి, బాధ్యతాయుత ప్రతిపక్షంగా వారికి అండగా నిలిచేందుకు తాను వస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించినప్పటి నుంచి ఇటు వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణాన్ని, బీఆర్ఎస్ ముఖ్యనేతల ఇండ్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మొదట మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసి ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీ నేత ఇంట్లో జరిగే పెండ్లికి హాజరయ్యేందుకు హరీశ్‌రావు వస్తున్నారని రూఢీ చేసుకున్న తరువాత పోలీసులు వినయ్‌భాస్కర్‌ను విడిచిపెట్టారు. పార్టీ నాయకుడు నార్లగిరి రమేశ్ కుమారుడి వివాహానికి హాజరైన అనంతరం అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లేందుకు వస్తున్న క్రమంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవో నిరసన చేపట్టింది. పెండ్లిలో కలిసిన ఉద్యోగులు.. హరీశ్‌రావును తమ శిబిరానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. హరీశ్‌రావు ప్రసంగం పూర్తి కావస్తుందనగానే ప్రాంగణం చుట్టూ వందలాది పోలీసులు చేరిపోయారు.
హనుమకొండ కలెక్టరేట్ ముందు ఉద్యోగుల ధర్నాకు హరీశ్‌రావు సంఘీభావం తెలుపుతున్న క్రమంలోనే టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్, ఏఆర్, స్పెషల్ పార్టీ, ఇంటెలిజెన్స్ బలగాలు భారీ ఎత్తున వేదిక ప్రాంగణాన్ని చుట్టుముట్టాయి. ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపి, అక్కడి నుంచి వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించడానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీశ్‌రావు వెళ్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. పోలీసుల తీరును హరీశ్‌రావు తీవ్రంగా ఆక్షేపించారు. తమ పార్టీ కార్యాలయానికి వెళ్లనీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పోలీసులను కోరారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలను తప్పిస్తూ పోలీసులు హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్యనేతలను తమ వలయంలోకి తీసుకున్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, టీ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు మర్రి యాదవరెడ్డి, గోసుల శ్రీనివాస యాదవ్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జోరిక రమేశ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకున్నది. ఎక్కడిక్కడ పార్టీ శ్రేణులను అడ్డుకోవటమే కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి నుంచి వ్యూహాత్మకంగా దూరం చేయటం ప్రారంభించారు.
మరోవైపు నాయకులు, కార్యకర్తలు సైతం అందుకు దీటుగా పోలీసుల వ్యూహాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు హరీశ్‌రావును అరెస్ట్ చేసి, తమ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. పోలీసుల వ్యూహాన్ని గమనించిన హరీశ్‌రావు మెరుపు వేగంతో పోలీసుల తీరుకు నిరసనగా తాను కాలినడకన పోలీసు స్టేషన్‌కు వస్తానని ప్రకటించారు. ఇందుకు పోలీసులు ససేమిరా అన్నా సరే వారి వలయం నుంచి తప్పించుకొని ఆయన అక్కడి నుంచి నడక ప్రారంభించటంతో గులాబీ శ్రేణులు ఆయన్ను అనుసరించారు. చేసేదేమీలేక సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి సహా పార్టీ నేతలను అరెస్టు చేశారు.
హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు. స్టేషన్ ముందు బైఠాయించారు. తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన హరీశ్‌రావును అరెస్టు చేశారని తెలుసుకొని, పాలిటెక్నిక్ విద్యార్థులు కేయూ బీఆర్ఎస్వీ నాయకుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీగా వచ్చారు. అనంతరం హరీశ్‌రావును పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్ మీదుగా సిద్దిపేటకు తరలించారు. ఇతర నాయకులను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.