హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇస్తానని, చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని నిస్సహాయ సీఎం రేవంత్రెడ్డి.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం నిర్వహించిన సభకు హాజరైన ముఖ్యమంత్రి దొరలాగా కాకుండా, దొంగచాటుగా వచ్చాడు’ అని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు. ఓయూ సభలో సీఎం వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. బారికేడ్లు, ముండ్ల కంచెలు, పోలీసుల పహారా నడుమ సీఎం ఓయూకు వచ్చారని విమర్శించారు. విద్యార్థుల, కాంట్రాక్టు అధ్యాపకుల, హాస్టల్ సమస్యలను పరిష్కరించకుండా పారిపోయారని మండిపడ్డారు. పోలీస్ నిర్బంధాల మధ్య సీఎం రేవంత్రెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు తొత్తుగా వీసీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
విద్యార్థులకు భరోసా ఏది?: గెల్లు
సీఎం రేవంత్రెడ్డి ఓయూ పర్యటన వల్ల విద్యార్థులకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయారని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ విమర్శించారు. గత ఆగస్టు 25న ఆయన వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అధికారులతో ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలేదని విమర్శించారు. యూనివర్సిటీలను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి ఓయూ సందర్శన వెనుక భారీ ఆర్థిక కుంభకోణం దాగి ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. ఆర్ట్స్ కాలేజీ వేదికపై సీఎం ప్రసంగంలో రాజకీయ ప్రయోజనాలే కనిపించాయని విమర్శించారు.