BRS Leader Deviprasad | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలను మోసం చేస్తున్నఅధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డు చెప్పడం సరికాదని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత పలు సందర్భాలలో క్లాక్ టవర్ వద్ద అన్ని వర్గాలు ఆందోళన చేసిన విషయం కాంగ్రెస్ మంత్రులు మరిచిపోయారని ఆరోపించారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా క్లాక్ టవర్ వద్దే దీక్ష చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలని దేవీ ప్రసాద్ సోమవారం వ్యాఖ్యానించారు. ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాటు ఎలాంటి సహాయం చేయలేదని ఇప్పుడు ఎకరానికి రూ.12,000లకు తగ్గించి రైతులను దగా చేస్తున్నదని ఆరోపించారు. రుణ మాఫీ, బోనస్ విషయంలో రైతులకు కోతలు విధించినట్లే రైతు భరోసా కొంత మందికి ఇచ్చి, వ్యవసాయ యోగ్యత పేర ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతుల ధర్నాకార్యక్రమంలో వేలాది మంది పాల్గొనడం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని దేవీ ప్రసాద్ చెప్పారు. ఏడవ గ్యారెంటీగా ఇచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ హామీని తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన ప్రజలపై అక్రమ నిర్బంధాలు కేసు నమోదు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు.
చివరకు అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి మద్దతుగా వెళుతున్న పౌర హక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, హరగోపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి నిర్బంధించడం దారుణం అని దేవీ ప్రసాద్ చెప్పారు. ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి నిర్బంధాలు ఎదుర్కోవడం కొత్త కాదన్నారు. నిర్బంధాలు, అణచివేతతోనే పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి సారించి ఏడు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాం అని స్పష్టం చేశారు.