Devi Prasad | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. కానీ బ్రాహ్మణ పరిషత్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణ విద్యార్థులు స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతున్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి అని దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.
విదేశాల్లో ఉన్న బ్రాహ్మణ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి ఆదుకోవాలి. బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వారి దగ్గర మేధాసంపత్తి తప్ప ఆస్తులు లేవు. ప్రభుత్వాలు మారితే పథకాలు మంచిగా అమలు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతున్నాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.