హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ): ప్రతీకార చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రభుత్వ పెద్దలు తప్పుడు కేసు బనాయించారని బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ విమర్శించారు. ఆయనపై ద్వేషంతోనే ఫార్ములా ఈ కార్ రేస్‌లో అక్రమాలు జరిగాయంటూ ఈ కేసును ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. న్యాయ విరుద్ధమైన చర్య నిజం ముందు ఏనాడూ నిలువబోదని పేర్కొన్నారు. ఈ కేసులో చివరికి కేటీఆర్‌కు న్యాయమే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నామని తెలిపారు.
న్యాయస్థానం తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రభు త్వం ప్రజాధనం, సమయాన్ని వృథా చేయకుండా పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సర్కార్‌కు హితవు పలికారు. నిజాయితీతో కూడిన పాలన అందించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పినట్టు విషపూరిత చర్యలు, ప్రతీకార విధానాలతో ప్రగతీశీల రాష్ట్రమైన తెలంగాణ తిరోగమన దిశగా ప్రయాణించే ప్రమాదమున్నదని దాసోజు ఆందోళన వ్యక్తంచేశారు.