Chirumalla Rakesh Kumar | హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పొలీసులను అడ్డం పెట్టుకొని మా బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారని పేర్కొన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే, విప్ లక్ష్మణ్ కుమార్.. ఉత్తర కుమారుడు అయ్యాడు. చర్చ పెట్టాలి అన్నారు.. చర్చకు వస్తే ఈ విధంగా దాడి చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో సల్వాజి మాధవరావు మీద కూడా అక్రమ కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించిన చరిత్ర లక్ష్మణ్ కుమార్కు ఉంది. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ దళిత బంధు ఇచ్చారు.. ఇంట్లో ఆడబిడ్డకు అండగా ఉండేందుకు కల్యాణ లక్ష్మీ ఇచ్చారు అని రాకేశ్ గుర్తు చేశారు.
మీరు అధికారంలోకి వచ్చాకా ఏ సంక్షేమ పథకం అమలు చేశారో చెప్పండి..? ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే దాడులు చేస్తున్నారు. ఇవాళ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు దాడులు చేస్తే మేము కూడా ప్రతి దాడులు చేస్తాం తస్మాత్ జాగ్రత్త. మొన్న మా సభ సక్సస్ కావడంతో ఈఎన్సీ హరీరాంపై ఏసీబీ దాడులు చేసింది. ఇవాళ మళ్ళీ ఘోష్ కమిషన్ నోటీసులు అంటున్నారు. ప్రశ్నిస్తే పాపం అన్నట్టు వ్యవహరిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీడియా ద్వారానే నోటీస్ అని విన్నాం. నోటీసులు వస్తే మా అగ్ర నాయకులు మాట్లాడుతారు. పొలిటికల్ నాయకులకు నోటీసులు లేవన్నారు.. మళ్ళీ ఇప్పుడు నోటీసులు అంటున్నారు అని చిరుమళ్ల రాకేశ్ పేర్కొన్నారు.