చివ్వెంల, సెప్టెంబర్ 7: సూర్యాపేట జిల్లా చివ్వెంల మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్‌పల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను హత్యాయత్నం కేసులో శనివారం అర్ధరాత్రి చివ్వెంల ఎస్సై మహేశ్వర్ అరెస్టు చేశారు. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని దురాజ్‌పల్లికి చెందిన షేక్ మునీర్ ఫిర్యాదు మేరకు మాజీ వార్డు కౌన్సిలర్ షేక్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. మునీర్ ఎడమ చేయి, ఛాతీ కింది భాగంలో గాయాలైనట్టు మెడికల్ సర్టిఫికెట్ స్వీకరించిన తర్వాత కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
దురాజ్‌పల్లిలో కొన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా బాషా మునీర్ వెంట పరుగెత్తడం కన్పించిందని అన్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి మారణాయుధాలు లభించలేదని చెప్పారు. మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను అక్రమంగా అరెస్టు చేశారంటూ దురాజ్‌పల్లి వాసులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన దిగారు. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ప్రజల ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు బాషాను విడుదల చేశారు.
యూరియా క్యూలైన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినందుకు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ వార్డు కౌన్సిలర్ షేక్ బాషాను అరెస్టు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం చివ్వెంల పోలీస్ స్టేషన్ వద్ద బాషాతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.