కాళేశ్వరంపై ఇచ్చింది చెత్త రిపోర్టు, చిత్తు కాగితం అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్!! విచారణ ముసుగులో మా హక్కుల్ని కాలరాశారు అందుకే తప్పుడు రిపోర్టుపై కోర్టు తలుపుతట్టినం కోర్టు ముందు నిలబడదని తెలిసీ.. ఆదివారం ఆదరాబాదరాగా అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలి చర్చ సందర్భంగా నిప్పులు చెరిగిన హరీశ్‌రావు
పార్టీలను వదిలి జనం కోసం ఉద్యమం చేసినందుకు! చావునోట్లో తల పెట్టి తెలంగాణ సాధించినందుకు!
దశాబ్దాలుగా తట్టెడు మట్టి తీయని ప్రభుత్వాలున్నచోట మూడేండ్లలోనే అద్భుత కాళేశ్వరాన్ని కట్టినందుకు!
గోదావరి నీళ్లను పట్టి రాష్ట్రం జలరాత మార్చినందుకు! 24 గంటల కరెంటు ఇచ్చి సాగును బాగుచేసినందుకు గోస తీర్చినందుకు! రైతును రాజును చేసినందుకు! తెలంగాణను దేశానికే ధాన్యాగారం చేసినందుకు! అంతా తప్పేనట! కాళేశ్వరం కట్టడమే శుద్ధ తప్పట! ఇవన్నీ చేసినందుకు సీబీఐని ప్రయోగిస్తదట!
తెలంగాణే తన జీవితం అనుకుని, తెలంగాణ ప్రజల అభ్యున్నతే తన జీవిత పరమార్థమనుకొని, తెలంగాణ సమాజ సంక్షేమమే సర్వస్వమనుకొని తన 45 ఏండ్ల రాజకీయ జీవితాన్ని తెలంగాణ చుట్టే ప్రదక్షిణం చేయించి, కలలో సైతం తెలంగాణ జపమే చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన కానుక ఇది. ఆరు దశాబ్దాలు తెలంగాణను పరిపాలించి సైతం సాగునీళ్లు, తాగునీళ్లు ఇవ్వలేని పార్టీలు ఆ ఘనత సాధించిన బీఆర్ఎస్పై ఓర్వలేని తనంతో చేసిన దుర్మార్గమిది. అంతకు ముందు అసెంబ్లీలో ఘోష్ కమిషన్ రిపోర్టు సాకుతో బీఆర్ఎస్ను బోనులో నిలబెట్టబోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి తానే దోషిగా నిలబడింది.
కాళేశ్వరం మీద బురద చల్లేందుకు, రాజకీయ కక్ష తీర్చుకునేందుకు కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. సబ్జెక్ట్ లేదు.. సంగతి లేదు.. ప్రిపరేషన్ అంతకన్నా లేదు. పైగా తమ్మిడిహట్టి హైట్ మీద.. మేడిగడ్డ డిస్టెన్స్ మీద మంత్రుల విజ్ఞానం నిండుసభలో బట్టబయలైంది. ఘోష్ నివేదికను ముందుపెట్టి అబద్ధాలు ఆడేందుకు ప్రయత్నించిన అధికారపక్షానికి బీఆర్ఎస్ చుక్కలు చూపించింది. నిండు సభలో కాళేశ్వరం నీళ్లు తాగించింది. సీఎం సహా మంత్రులు మూకుమ్మడి దాడిచేసినా.. ఒక్కొక్కరికి సమాధానమిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌ను సభలో స్వైరవిహారం చేశారు. అధికార కాంగ్రెస్ అడ్డగోలు వాదనను ఎక్కడికక్కడ చీల్చి చెండాడారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వేసిన ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక వేస్ట్ పేపర్ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఘోష్ కమిషన్ తమ హక్కులను కాలరాసిందని, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్టు 1952 ప్రకారం 8బీ కింద తమకు నోటీసులుగాని, క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం గాని ఇవ్వలేదని, నిబంధనలు పాటించకుండా చేసిన విచారణ ఎట్లా చట్టబద్ధమవుతుందని ప్రశ్నించారు. అందుకే ఈ విచారణ అన్యాయమైనదని, అశాస్త్రీయమైనదని, రాజకీయంగా ప్రేరేపితమైనది విమర్శించారు.
విచారణ ఎదుర్కొనే వారిని సాక్షులుగా మాత్రమే పిలిచి, 8(బీ) కింద ప్రతివాదన వినిపించేందుకు నోటీసులు ఇవ్వకపోతే ఆ విచారణ చెల్లదని గతంలో అనేక కోర్టులు తీర్పులిచ్చాయని గుర్తుచేశారు. ఇందిరాగాంధీపై వేసిన షా కమిషన్, బీజేపీ అగ్రనేతలపై వేసిన లిబర్హాన్ కమిషన్ రిపోర్టులను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. నోటీసులివ్వకుండా, చట్టాన్ని గౌరవించకుండా తమ హకులను కాపాడకుండా ఇచ్చిన ఘోష్ కమిషన్ రిపోర్టు కూడా న్యాయస్థానం ముందు నిలబడదని,చట్టవిరుద్ధమన్న విషయం సీఎం రేవంత్‌రెడ్డికి కూడా అర్థమైందని, అందుకే సోమవారం హైకోర్టు విచారణ ఉండగా, ఆదరాబాదరాగా ఆదివారం చర్చ పెట్టారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తాము కమిషన్ నివేదికపై చర్చ వద్దనడం లేదని, ఒక రోజు కాకుంటే నాలుగు రోజులు చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. తమపై అడ్డగోలు ఆరోపణలుచేసి అర్ధగంటలో మాట్లాడాలంటే ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. ‘ఇవాళకాకపోతే రేపు మాట్లాడటానికైనా సిద్ధం. ప్రజలకు ఇంకా క్లియర్‌గా విజువల్‌గా చెప్పడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి కోరాను. కానీ, ఇవ్వలేదు’ అని చెప్పారు. ‘650 పేజీల రిపోర్టు ఇస్తిరి. బయట తొడలు కొడితిరి. కాళేశ్వరం మీద మాట్లాడుదాం రండి అంటిరి.. తీరా మాట్లాడుదామంటే.. అర్ధగంటలో ము గించాలంటే ఎట్లా?’ అని ప్రశ్నించారు.
సహజ న్యాయ సూత్రాలకు, చట్టాలకు లోబడి విచారణ జరగనందున ఘోష్ కమిషన్ రిపోర్టు చిత్తు కాగితాలతో సమానమని హరీశ్ స్పష్టంచేశారు. ‘రాజకీయ కక్ష సాధింపులకే కమిషన్లు.. కమిషన్ రిపోర్టు గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధివిధానాలను పాటిస్తూ జరిగిందా? లేదా? అనేది చర్చించాల్సి ఉన్నది. అట్లా లేనిపక్షంలో ఆ విచారణకు విలువుండదు’ అని తేల్చిచెప్పారు.
‘విచారణ కమిషన్ చట్టం-1952 ప్రకారం ప్రభుత్వాలకు సంబంధిత అంశం మీద విచారణ చేసే హకు ఎంత ఉన్నదో.. విచారణను ఎదుర్కొనే పౌరులు, అధికారులు, నాయకులు ఎవరికైనా ఏకపక్ష విచారణల నుంచి తమను తాము రక్షించుకునేందుకు హకులను కూడా చట్టం కల్పించింది’ అని హరీశ్ గుర్తుచేశారు. ‘ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం విచారణ కమిషన్‌కు సాక్షులను పిలిచి, ఆధారాలు సేకరించే అవకాశం ఉన్నది. విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలోని సెక్షన్ 8బీ ప్రకారం నోటీసులివ్వాలి.
వాళ్లను వాళ్లు డిఫెండ్ చేసుకోడానికి సంపూర్ణ అవకాశం ఇవ్వాలని విచారణ కమిషన్ చట్టం స్పష్టంగా పేరొన్నది. కమిషన్ సేకరించిన ఆధారాలను తాముగాని, తమ తరఫు అడ్వొకేట్గాని, క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కూడా తగిన హకును, అధికారాన్ని 1952 యాక్టు 8(సీ) కల్పించింది. పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంలో ఎఫెక్టెడ్ పీపుల్ అయిన మా హకులను కాలరాశారు.
కేసీఆర్ గారికిగాని, నాకుగాని, మాజీ ఐఏఎస్ అధికారులకుగాని, ఇతర ఇంజినీర్లకుగాని డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రతివాదనలు వినిపించాలని 8(బీ) కింద నోటీసులు జారీ చేయలేదు. అంటే ఈ కమిషన్ ఉద్దేశపూర్వకంగా, విధివిధానాలను తుంగలో తొకిం ది. విచారణలో విధానపర లోపాలున్నాయనేది సుస్పష్టం. ఎందుకు ప్రొసీజర్ లాప్స్కు పాల్పడ్డారు? ఎందుకు చట్టాన్ని గౌరవించలే దు? ఎందుకు మాకున్న న్యాయమైన హకులను నిరాకరించారు? ఎందుకంటే విచారణ మొత్తం రాజకీయ కక్ష సాధింపే తప్ప, వాస్తవాల శోధన కాదు’ అని ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందునుంచే కాళేశ్వరంపై కాంగ్రెస్ అభాండాలు మోపుతూ వచ్చిందని, సిట్టింగ్ జడ్జ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిందని, అంటే ఇది ముంద స్తు ప్రణాళికలతో కూడిన కుట్ర అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిషన్ చేసే పని ఫ్యాక్ట్ ఫైండింగ్ మాత్రమేనని, న్యాయ విచారణ కాదని స్పష్టంచేశారు. వాస్తవాల పరిశోధన చట్టానికి లోబడి చేయాలని,లేదంటే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టేనని, సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను అపహాస్యం చేయడమేనని చెప్పారు. 8 (బీ) ప్రకారం నోటీసులివ్వకుం డా చేసిన విచారణ రిపోర్టుల గురించి వివిధ సందర్భాల్లో కోర్టులు తీర్పులిచ్చాయని గుర్తుచేశారు.
ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నదని హరీశ్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ‘రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ టెండూలర్ కేసులో విచారణ కమిషన్‌ను పొలిటికల్ వెపన్‌గా వాడకూడదని 1958లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరం మీద మీరు మొదటి నుంచీ చేస్తూ వచ్చిన గోబెల్స్ ప్రచార చరిత్రను పరిశీలిస్తే ఘోష్ కమిషన్‌ను మీరొక పొలిటికల్ వెపన్‌గా వాడారన్నది స్పష్టంగా తెలుస్తున్నది. ఓ జడ్జిమెంట్‌లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీర కూడదు.
చట్టం పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని కుండబద్దలు కొట్టింది. పీసీ ఘోష్ కమిషన్ 1952 ఎంక్వైరీ చట్టాన్ని పాటించలేదు. 8(బీ) కింద నోటీసులివ్వని విచారణ ఎట్లా నిష్పాక్షికమవుతుంది? ఎట్లా చట్టబద్ధమవుతుంది?. 1989లో కిరణ్ బేడీ వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీలో 8(బీ) కింద నోటీసులు ఇవ్వకుండానే విచారణ చేసి, రిపోర్టు ఇస్తే అది చెల్లదు, న్యాయబద్ధం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన కమిషన్ రిపోర్టును హైకోర్టు రద్దుచేసింది.
8(బీ) కింద నోటీసు ఇవ్వనందుకు 2003లో ఎల్కే అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో పట్నా హైకోర్టు తీర్పును అనుసరించి, ఆ ఎంక్వైరీ రిపోర్టు రర్దయింది. పీసీ ఘోష్ కమిషన్ చేసిన విధంగానే 1997లో జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో విచారణ ఎదుర్కొనే వారిని సాక్షులుగానే పిలిచి, 8(బీ) కింద ప్రతివాదన వినిపించేందుకు నోటీసులు ఇవ్వకపోతే ఆ విచారణ కూడా చెల్లదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు సందర్భంగా 8(బీ) నోటీసులు ఇవ్వడం తప్పనిసరి అని చెప్పింది’ అని గుర్తుచేశారు.
‘ఇందిరాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ మాత్రమే కాదు బీజేపీ కీలక నేతలపై గతంలో వేసిన లిబర్హన్ కమిషన్ రిపోర్టును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది’ అని హరీశ్ గుర్తుచేశారు. ‘బాబ్రీ మసీదు కూల్చివేతపై 1992 డిసెంబర్ 16న పీవీ నర్సింహారావు ప్రభుత్వం వేసిన లిబర్హాన్ కమిషన్ కథ కూడా చూద్దాం. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిపై విచారణ మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పినా, 48 సార్లు కమిషన్ గడువు పొడిగించారు. 17 ఏండ్లు నడిపించారు. దేశ చరిత్రలోనే సుదీర్ఘ కాలం నడిచిన కమిషన్ ఇదే.
నేటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ఎలాగైతే అసెంబ్లీలో పెట్టేకంటే ముందే మీడియాకు లీక్ చేశారో.. నాటి లిబర్హన్ కమిషన్ రిపోర్టును కూడా కాంగ్రెస్ ముం దే లీక్ చేసింది. లిబర్హన్ కమిషన్ మీద అప్పు డు పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద చర్చ జరిగింది. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఈ నివేదిక రాజకీయ ప్రతీకారం, పక్షపాతంతో కూడుకున్నదని ఆరోపించాయి. 17 ఏండ్లు పరిశోధిం చి ఇచ్చిన లిబర్హన్ కమిషన్ రిపోర్టును సుప్రీంకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ మీద వేసిన కమిషన్ల రిపోర్టులను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఒకటై కమిషన్లపై మాకు సుద్దులు చెప్తున్నయి. ఇది దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం’ అని మండిపడ్డారు.
కోర్టులకు ఎందుకు వెళ్లారనే ఆరోపణలపై హరీశ్ స్పందిస్తూ సహజ న్యాయాన్ని పాటించనప్పుడు, తమ హక్కులకు భంగం వాటిల్లిప్పుడు కోర్టులకు వెళ్లే అవకాశం ఎవరికైనా ఉంటుందని చెప్పారు. తాము కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని వెళ్లాము తప్ప అసెంబ్లీలో చర్చించ వద్దని కాదని, ఈ విషయంలో ఉత్తమ్ సరిగా ప్రిపేర్ అయినట్టు లేరని ఎద్దేవాచేశారు. ‘ఏవైనా అనుమానాలుంటే.. అడ్వొకేట్ జనరల్‌కు కాల్ చేసి, ఆయన నుంచి తమ పిటిషన్ కాపీని తెప్పించుకొని చదువుకొని దాని నుంచి ప్రిపేర్ అవ్వండి’ అని హితవు పలికారు. మాటమార్చొద్దు అంటూ స్పీచ్ మధ్యలో అడ్డం తిరిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హరీశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మాట మార్చుడు కోమటిరెడ్డికి అలవాటు ఉంటది తప్ప.. నాకు ఉండదు. విషయం చెప్పాలి. కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనేలేదని మాట్లాడారు’ అని గుర్తుచేశారు.
ఆ నాడు కేసీఆర్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రిపేర్ కాలేదని చెప్పారని హరీశ్ గుర్తుచేశారు. దానికి ఉత్తమ్ స్పంది స్తూ ‘హరీశ్‌రావు గారు హద్దు దాటుతున్నారు. లిమిట్లో ఉండండి. ఆ సంఘటన అట్ల జరగలేదు. లక్ష కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి, ఇంకా నవ్వుతున్నారు.. సిగ్గుండాలి. సిగ్గుండాలి’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో కలుగజేసుకున్న హరీశ్ ‘పాపం దొరికిపోయా రు.. ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కం డ్లముందు కనిపిస్తున్నది. ఆన్సర్ లేదు.. ఆయన అసహనాన్ని వదిలేస్తున్నం’ అంటూ సున్నితంగా చిరునవ్వుతో క్షమించి వదిలేశారు.
‘ఈ రిపోర్టు కోర్టు ముందు నిలబడదు. ఇదొక డొల్ల రిపోర్టు. చెత్త రిపోర్టు. హైడ్రాలజీ చెప్పిన లెక్కల ప్రకారం.. మీరు ఏదైతే 160 టీఎంసీలు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవని కేంద్ర జల సంఘం 18.2.2015న చెప్పింది’ అని హరీశ్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నీళ్ల కోసం తాను నీళ్ల మంత్రిగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి మంత్రి ముషారఫ్‌ను కలిసి మాట్లాడానని గుర్తుచేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తాము అనుమతించలేదని చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం వచ్చిందని, ఆ ప్రభుత్వం వద్దకు కూడా వెళ్లినట్టు చెప్పారు. వారు కూడా ఒప్పుకోకపోవడంతో కేసీఆర్, విద్యాసాగర్ సమక్షంలో స్వయంగా మహారాష్ట్రకు వెళ్లినట్టు గుర్తుచేశారు. అయినా ప్రాజెక్టు కట్టుకోవడానికి ఒప్పుకోమని మహారాష్ట్ర తేల్చిచెప్పినట్టు వివరించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా కాకుండా విధివిధానాలకు వ్యతిరేకంగా చేపట్టినందున న్యాయ ప్రక్రియకు నిలబడదని తెలిసే అదరాబాదరాగా చర్చపెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్టు 1952 ప్రకారం 8బీ, 8సీ పాటించలేదని, నిబంధనలు అనుసరించలేదని మేం కోర్టుకు పోయినం. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మేమెకడ సుప్రీంకోర్టుకు పోయి విచారణ కమిషన్‌ను రద్దు చేయిస్తమోనని ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. కమిషన్ రిపోర్టు ఎట్లాగూ కొట్టుడుపోతదని ఆదరాబాదరాగా ఆదివారం అసెంబ్లీలో చర్చకు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రైమరీ రిపోర్టు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంటీరియం రిపోర్టు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సమయంలో తుది రిపోర్టు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఘోష్ కమిషన్ రిపోర్టు.. వీరు ప్రభుత్వం నడుపుతున్నారా? డ్రామా కంపెనీ నడుపుతున్నరా?’ అని నిప్పులు చెరిగారు.
ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాల మీద విచారణ కోసం అప్పటి జనతా ప్రభుత్వం వేసిన జస్టిస్ జేసీ షా కమిషన్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందని హరీశ్ ప్రశ్నించారు. ‘ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటరు కదా? ఆ ఇందిరమ్మ మీద విచారణ కమిషన్ వేశారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన గొప్ప చరిత్ర కాంగ్రెస్‌ది. ఎమర్జెన్సీలో జరిగిన అరాచకాల మీద అప్పటి జనతా ప్రభుత్వం జస్టిస్ జేసీ షా కమిషన్‌ను నియమించింది. ఆ షా కమిషన్ సెక్షన్ 5(2)(ఏ) కింద మొదట నో టీసులిచ్చింది. ఆధారాలు సేకరించింది. ఆ తర్వాత సెక్షన్ 8(బీ) కింద ఇందిరాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ వంటివారికి నోటీసులు జారీ చేసింది. డిఫెన్స్ చేసుకొనే అవకాశం కల్పించింది. 1978, ఆగస్టు 6న తుది రిపోర్టు ఇచ్చింది.
నాటి షా కమిషన్‌కు, నేటి ఘోష్ కమిషన్‌కు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. ఆ రిపోర్టును 1978 ఆగస్టు 31 నాడు పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఇదే తీరుగా కాళేశ్వరంపై వేసిన ఘోష్ కమిషన్ రిపోర్టు మీకు జూలై 31న ఇస్తే, మీరు ఆగస్టు 31న అసెంబ్లీలో పెడుతున్నరు. జస్టిస్ షా కమిషన్ రిపోర్టును నాడు కాంగ్రెస్ నాయకులు తప్పుల తడక అన్నరు. దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇచ్చి న తీర్పును తప్పు పట్టారు. వారు అట్లా చేస్తే రైటట! నేడు తెలంగాణ రైతుల కష్టాలు తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర పూరితంగా వేసిన కమిషన్.. విధివిధానాలను కాలరాస్తూ, చట్టాన్ని తుంగలో తొకుతూ, ప్రతివాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చి న రిపోర్టును మేము విమర్శిస్తే మాత్రం రాంగట! మీపై వేసిన కమిషన్లను మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు,
కానీ మాపై వేసిన కమిషన్‌ను మేము వ్యతిరేకిస్తే తప్పా? ఇదేం నీతి? ఘోష్ కమిషన్ మా హకులకు భంగం కలిగించిందంటే న్యాయమూర్తి రిపోర్టును తప్పు పడుతరా? అని మాకు సుద్దులు చెప్తున్నరు. షా కమిషన్ 8(బీ) కింద నోటీసులిచ్చి నా తమ హకులకు భంగం వాటిల్లిందని నాడు ఇందిరాగాంధీ, ప్రణబ్ ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టిండ్రు. 1978, నవంబర్ 7న ఢిల్లీ హైకోర్టు 8(బీ) విధానపరమైన న్యాయబద్ధత లేదని షా కమిషన్ రిపోర్టును రద్దు చేసింది. షా కమిషన్ రిపోర్టే రద్దయితే, నోటీసులు సర్వ్ చేయకుండా చట్టాన్ని గౌరవించకుండా, మా హకులను కాపాడకుండా ఇచ్చిన ఘోష్ కమిషన్ రిపోర్టు పరిస్థితి ఏం గావాలె? చట్టపరంగా ఈ రిపోర్టు చెల్లుతుందా?’ అని హరీశ్ మండిపడ్డారు.