Telangana | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రం లో గ్రామగ్రామాన అంగరంగ వైభవంగా పం డుగ వాతావరణంలో నిర్వహించుకొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘వజ్రపు తునక తెలంగాణ. స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంలో జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుం దాం’ అని తెలిపారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, సాధించిన అభివృద్ధిని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత పార్టీలోని అందరిమీదా ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు ఇ లా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు భాగస్వాములు కావాలని నిర్దేశించా రు. మంగళవారం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు, పార్టీ ఎం పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్యవర్గం, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు స హా ముఖ్య నాయకులు పాల్గొన్న సమావేశంలో ఉత్సవాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రగతి దర్శనంతో పారవశ్యం చెందాలి
ప్రజలు గర్వపడే కార్యక్రమాలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. నియోజకవర్గాల వా రీగా ప్రగతిని డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించేందుకు ఎమ్మెల్యేలకు మంత్రులు మార్గదర్శనం చేయాలని చెప్పారు. నియోజకవర్గాల వారీగా అన్నిరంగాల అభివృద్ధి లెక్కలు తీసి వాటిని ప్రజలకు అర్థమయ్యేలా విడమరచి చెప్పాలని ఆదేశించారు. ‘దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలి. ఎక్కడ చూ సినా పండుగ వాతావరణం నెలకొనాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ పారదర్శక, అవినీతిరహిత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని సూచించారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వి నియోగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిన విషయాన్ని సోషల్ మీడియా, స్థానిక ప్రచార వేదికల ద్వారా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు. ‘రాష్ట్రంలో 3,400 గిరిజన తండాలు, గోండు గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చుకొన్నాం. ఇది చరిత్ర. వెయ్యి గొంతుకలతో మనం చేసిన పనిని చెప్పుకోవాలి’ అని సూచించారు.
సింగరేణిపై కేంద్రం కుట్రలను ఎండగట్టాలి
సింగరేణి సంస్థను మొత్తం మనమే తీసుకొంటం అంటే ప్రధాని మోదీ ఎలా సాగనివ్వటం లేదో ప్రజలకు వివరించేలా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘సింగరేణి తెలంగాణ కొంగు బంగారం. పదేండ్లకింద రూ.12 వేల టర్నోవర్ ఉంటే ఇప్పుడు రూ.33 నుంచి రూ.34 వేల కోట్లకు చేరింది. ఈ విజయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలపై ఉన్నది. 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక మైనింగ్ ద్వారా రూ.36 కోట్లు వ స్తే.. మన ప్రభుత్వం ఐదేండ్లలోనే రూ.5,600 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఘనతను చెప్పుకోవాలి’ అని కేసీఆర్ వివరించారు.
వైతాళికులు.. మన వైభవ దీప్తులు
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోని వైతాళికులను గుర్తించి వారి ఘన వారసత్వ దీప్తిని ఈ తరానికి తెలిసేలా ప్రచా రం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘మన ప్రాంతంలోని వైతాళికులను గుర్తించి గౌ రవించాలి. ఉదాహరణకు భాగ్యరెడ్డివర్మ. ని జాం కాలంలోనే హైదరాబాద్ మున్సిపాలిటీలో దళతులకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి మహనీయుల కృషి అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవీ, సురవరం ప్రతాపరెడ్డి ఇలా ఎక్కడెక్కడి వైతాళికులను గుర్తించి వారిని కీర్తించాలి. వీరంతా తెలంగాణ వైతాళికులు. వీ రేకాకుండా మహనీయులను గుర్తించి వారి చారిత్రక, సామాజిక సేవానిరతిని నేటి తరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది. ఈ విషయంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న సేవలను వాడుకోవాలి. సంప్రదాయ కళాకారులతో ఊరేగింపు నిర్వహించాలి. కవి సమ్మేళనాలతో కవులను సత్కరించాలి’ అని సూచించారు.
పీవీ మన ఠీవి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ ఠీవి అని సీఎం కేసీఆర్ కీర్తించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పీవీని స్మరించుకోవాలని అన్నారు. దేశంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆద్యుడు పీవీ అని, పీవీ జమానాలో సర్వేల్లో తొలి రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించారని, ఆ మహనీయుడి స్ఫూర్తితో నే మనం గురుకులాలు ఏర్పాటు చేసుకొన్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇవ్వాళ 1,001 గురుకులాలను స్థాపించి వాటిని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసుకున్నామని చెప్పారు. పేద బిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యతో సత్ఫలితాలు వస్తున్నాయని, ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో మన బిడ్డలకు సీట్లు రావటం గర్వకారణమని చెప్పారు.
పీవీకి మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి గురువు ఎలా అయ్యారో కేసీఆర్ వివరించారు. ‘వరంగల్ జిల్లాలోని గొప్ప నాయకుల్లో నూకల రామచంద్రారెడ్డి ఒకరు. ఆయన సీఎం కావా ల్సిన వ్యక్తి. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే ఆ పదవి వద్దని అప్పటి కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పారు. మంత్రివర్గంలోకి రావాలని నాటి ప్రభుత్వం ఆయనను ఆహ్వానిస్తే.. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. దేశానికి అవసరమైన అద్భుత ప్రతిభ ఉన్న యువకుడు పీవీకి మంత్రి పదవి ఇస్తేనే నేను తీసుకొంటా’ అని చెప్పిన గొప్ప వ్యక్తి నూకల రామచంద్రారెడ్డి’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
అందరూ భాగస్వాములు కావాలి
దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుసహా అన్ని స్థాయిల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉత్సవాల్లో భాగస్వా మ్యం కావాలని ఆదేశించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2తో తొమ్మిదేండ్లు పూర్తయి పదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. ఇది తెలంగాణ ప్రజలకు పండుగ సందర్భం. 21 రోజులపాటు ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించాలి’ అని సూచించారు. ఈ పదేండ్లలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా బ్యా నర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని తెలిపారు. అన్ని ప్రచార మాధ్యమాల్లో మన చరిత్ర.. విజయగాథలను డాక్యుమెంటరీల రూపంలో ప్రదర్శించాలని సూచించారు.