BRS | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తలపెట్టిన డాలస్ సభపై సర్వత్రా ఆసక్తినెలకొన్నది. పార్టీ నేతలు, ఎన్నారై విభాగం నేతలు డాలస్ సభను తెలంగాణకు తలమానికంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. జూన్ 1న డాలస్‌లో నిర్వహించనున్న సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు డాలస్ సభ ఏర్పాట్లలో భాగంగా యూఎస్ఏలోని తెలంగాణ బిడ్డలను ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో కలుస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లపాటు అన్ని రంగాల్లో తెలంగాణ అద్వితీయంగా ముందుకు సాగిన క్రమం, ప్రస్తుతం నెలకొన్న స్థితిగతులపై ఎన్నారైల్లో విస్తృత చర్చ సాగుతున్నది. డాలస్ సభ నేపథ్యంగా యూఎస్ఏలోని పలు రాష్ర్టాల్లో సన్నాహక సమావేశాల నిర్వహణలో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు సమన్వయం చేస్తున్నారు.
డెలావేర్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు
బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో బుధవారం డెలావేర్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, క్రాంతికిరణ్ చంటి, పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమంలో మమేకమై తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో ఎన్నారైల పాత్ర కీలకమని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వివరించారు.
ఏ లోటూ రాకుండా ఏర్పాట్లు: మహేశ్ తన్నీరు
అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని పలు ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎన్నారైలకే కాకుండా హాజరయ్యే తెలంగాణ బిడ్డలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా బయటి దేశంలో ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఎన్నారైలంతా కసికట్టుగా ఈ రజతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన డాలస్ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, శ్రీనివాస్ సురకుంటి, అభిలాశ్ రంగినేని, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, ముఠా జయసింహ, ఆశిష్ యాదవ్, శ్రీనివాస్ సురభి, హరికృష్ణ దొర్నాల, నరసింహ నాగులవంచ తదితరులతో కలిసి పరిశీలించారు.