హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : ఆటోడ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రభుత్వ ముందుచూపులేని విధానాలతోనే రాష్ట్రంలో ఆటోడ్రైవర్లు ఉపాధి అవకాశాలను కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాయిదా తీర్మానంలో పేర్కొన్నది. ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏటా రూ.12వేలు ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నది. ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించింది.
సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాసటగా నిలిచారు. అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తి చాటిచెప్పేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌తో సహా నేతలందరూ ఖాకీ చొకాలను ధరించి శాసనసభకు వచ్చారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భaంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 93మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చామని, అయినప్పటికీ వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని నిప్పులు చెరిగారు. ఆటోడ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, న్యాయం జరిగేవరకూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పక్షాన పోరాడతామని కేటీఆర్ ఉద్ఘాటించారు.