హైదరాబాద్, జనవరి 25 (నమస్తేతెలంగాణ): ‘గెట్ అవుట్ ఫ్రం మై చానల్’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావుపై దురుసుగా వ్యవహరించి అవమానించిన ఏబీఎన్ చానల్ ప్రతినిధి తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణించింది. సదరు చానల్ వ్యాఖ్యాత వెంకటకృష్ణ వ్యవహారశైలిని, దురహంకార వైఖరిని తప్పుబడుతూ ఏబీఎన్ చానల్‌ను పార్టీ బహిష్కరించింది. ఆ చానల్లో జరిగే చర్చా కార్యక్రమాలకు పార్టీ నేతలు వెళ్లొద్దని, పార్టీ నేతలు నిర్వహించే మీడియా సమావేశాలు, బహిరంగ సభలకు ఆ చానల్ ప్రతినిధులను అనుమతించవద్దని నిర్ణయించింది.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆదివారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ రవీందర్‌రావుపై ఆ చానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును ఖండించారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న వారిపై దురుసు వ్యాఖ్యలు చేయడం పాత్రికేయ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం, పార్టీ ప్రజాప్రతినిధులపై అసభ్యంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉన్నదని సోమ భరత్‌కుమార్ ఆ ప్రకటనలో గుర్తుచేశారు. అనంతర కాలంలోనూ బీఆర్ఎస్ నాయకులపై అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పదేపదే అదే చేస్తుండటంపై ఆక్షేపణ వ్యక్తంచేశారు. అనేకసార్లు అభ్యంతరం తెలిపినా బీఆర్ఎస్, తెలంగాణపై ఆంధ్రజ్యోతి వైఖరి మార్చుకోలేదనే విషయాన్ని పునరుద్ఘాటించారు.
చిక్కడపల్లి, జనవరి 25: తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏబీఎన్ మీడియా, ఆంధ్రజ్యోతి పత్రికాధినేత రాధాకృష్ణ దిష్టిబొమ్మను హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తాలో ఆదివారం బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావును ఏబీఎన్ వెంకటకృష్ణ అవమానిండాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, కల్వ నితీశ్, మేడి పవన్ మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యల గురించి ఏనాడూ ప్రస్తావించని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. తెలంగాణపై విషపు రాతలు రాస్తుందని ధ్వజమెత్తారు.