హైదరాబాద్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ) : రజకుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 102 జీవోనూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పని రజకులకే అప్పగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దానిని అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ తీవ్ర తాత్సారం చేస్తున్నది. అమలు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్నది లేదని రజకసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ గురుకులాలు, వైద్యశాలలు తదితర ప్రభుత్వసంస్థల్లో బట్టలు ఉతికే పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని రజకులు ఆ పనులను పొందలేకపోతున్నారు.
అదేసమయంలో స్థోమత కలిగిన ఇతర కులాలు, వర్గాలు కాంట్రాక్టు పనులను చేస్తుండగా, రజకులు వారివద్దే కూలీలుగా కాలం వెల్లదీస్తున్న దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వసంస్థల్లో బట్టలుతికే కాంట్రాక్టు పనులను రజక సొసైటీలకు అప్పగించాలని, రజక కులస్తులకు వృత్తి రక్షణ కల్పించాలని కులసంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఇదే విషయమై పలుమార్లు నేరుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను కలిసి వినతపత్రాలు అందజేశారు. సంఘాల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వసంస్థల్లో బట్టలు ఉతికే పనులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదనే నిర్ణయించడంతో ఫెడరేషన్ పరిధిలోని 4,417 రజక సొసైటీలు హర్షం వ్యక్తం చేశాయి.
వారికే బాధ్యతలు
రజక సొసైటీల ద్వారా రజకులకు మాత్రమే ఆ పనులను అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూన్30వ తేదీన జీవో 102 ను జారీ చేసింది. ప్రభుత్వ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లోని స్పోర్ట్స్ అకాడమీల హాస్టళ్లు, దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలు, రోడ్లు భవనాలశాఖ పరిధిలోని గెస్ట్‌హౌస్‌లు, పోలీస్ డిపార్టమెంట్ హెడ్క్వార్టర్లు, బెటాలియన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ వైద్యశాలలు, తెలంగాణ వైద్యా విధాన పరిషత్‌లోని దవాఖానల్లో బట్టలు ఉతికే పనిని అప్పగించాలని నిర్ణయించింది. ఆ మేరకు 102 జీవోలో స్పష్టంగా పేర్కొంటూ వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఎండీకి ఆదేశాలను సైతం జారీ చేసింది.
పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 102 జీవో అమలును అటకెక్కించింది. జీవో అమలుకు అనుమతి మంజూరు చేయాలని తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఫిబ్రవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు పంపి ఏడాది కావస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. జీవో అమలు చేయాలని ఇప్పటికీ రజకసంఘాల నేతలు, రాష్ట్రంలోని 4,417 సొసైటీలు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి, మంత్రులను కూడా కలిశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంపై రజకసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా 102 జీవోను వెంటనే అమలు చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.