Aurangabad | (ప్రత్యేక ప్రతినిధి-నమస్తే తెలంగాణ) హైదరాబాద్, ఏప్రిల్ 23 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌తో హైదరాబాద్‌కు విడదీయరాని అనుబంధమున్నది. నిజాం పాలనలో ఔరంగాబాద్ హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగం. ఈ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అందులో తెలంగాణకు చెందిన 8 జిల్లాలు, మహారాష్ట్రకు చెందిన 5 జిల్లాలు (ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, నాందేడ్, పర్భణి), కర్ణాటకకు చెందిన 3 జిల్లాలు (బీదర్, గుల్బర్గా, రాయచూర్) ఉన్నాయి. సంస్థానంలో తెలంగాణ జనాభా 90 లక్షలు, మరాఠ్వాడా జనాభా 45 లక్షలు, కర్ణాటక జనాభా 20 లక్షలు.
వందేమాతర ఉద్యమం ఇక్కడి నుంచే
భారత స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో హైదరాబాద్‌తోపాటు ఔరంగాబాద్ కేంద్రంగా అనేక ఉద్యమాలు ఉధృతంగా సాగాయి. హైదరాబాద్ స్టేట్‌లో అరెస్ట్ చేసిన అనేక మంది సమరయోధులను ఔరంగాబాద్, గుల్బర్గా జైళ్లలో బంధించేవారు. 1938లో వందేమాతరం గీతం ఆలపించడాన్ని నిషేధించారు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఆలపించిన విద్యార్థులను ఎక్కడా చదువుకోకుండా ప్రభుత్వం నిషేధించగా.. వారంతా మహారాష్ట్రలోని నిజాం పాలనలోనే నాగపూర్, పుణే వంటి పట్టణాలకు వెళ్లి చదువుకున్నారు. అలా వెళ్లినవారిలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరు. మొట్టమొదట వందేమాతర ఉద్యమం ఔరంగాబాద్‌లోనే ప్రారంభమైనట్టు చరిత్రకారులు చెప్తారు. ఔరంగాబాద్ ప్రభుత్వ కాలేజీలో అప్పటి అధ్యాపకుడు గోవిందదాసు విద్యార్థులలో దేశభక్తి భావాలు పెంపొందిపజేసి వందేమాతర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇది తెలంగాణలోని కరీంనగర్‌కు మొదట పాకి ఆ తర్వాత 1939లో సంస్థానమంతా వ్యాపించింది.
స్టేట్ కాంగ్రెస్ తొలి సమావేశం ఇక్కడే
హైదరాబాద్ సంస్థానంలో తొలి రాజకీయ పార్టీగా 1937లో స్టేట్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించగా, దీని ప్రథమ సమావేశం ఔరంగాబాద్‌లోనే జరిగిందని స్వాతంత్ర సమరయోధుల కథనం. కాగా స్టేట్‌కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం ఎల్లారెడ్డిని అరెస్ట్ చేసి కొంతకాలం పాటు ఔరంగాబాద్ జైలులోనే నిర్బంధించారు. హైదరాబాద్ సంస్థానంలో ఖద్దర్ పరిశ్రమను అభివృద్ధి పర్చటానికి అన్నాసాహెబ్ సహస్రబుద్దేను మహారాష్ట్ర చరఖా సంఘం పంపించింది. చేనేత కార్మికుల సమస్యలపై 1946లో సిరిసిల్లలో జరిగిన మహాసభకు బొంబాయి, సోలాపూర్, అహ్మదాబాద్ నుంచి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Brs1
మహారాష్ట్ర నుంచి ఎంపీగా పీవీ
మహారాష్ట్రతో తెలంగాణకు రాజకీయ అనుబంధం ఈనాటిది కాదు. తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు పర్యాయాలు మహారాష్ట్ర నుంచే లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. మహారాష్ట్రలోని రాంటెక్ లోక్‌సభ స్థానం నుంచి పీవీ నరసింహారావు 1984-89, 1989-91 వరకు వరుసగా రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు.. ప్రస్తుత ఔరంగాబాద్ ఎంపీగా ఉన్నది కూడా హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అభ్యర్థే కావటం గమనార్హం. స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా మద్రాసుకు వెళ్తే.. తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా మహారాష్ట్రకు వెళ్లేవారు.
హైదరాబాదీ భాష, యాస, రుచులు
ఔరంగాబాద్‌కు హైదరాబాద్‌తో పూర్వం నుంచి ఉన్న అనుబంధం ఇంకా అలాగే కొనసాగుతున్నది. ఇప్పటికీ ఇక్కడి ఆహార అలవాట్లు, వంటకాలు, రుచులు హైదరాబాద్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. సుగంధ ద్రవ్యాలతో ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీ, పలావ్‌కు ఔరంగాబాద్ పెట్టింది పేరు. ఇక భాష, యాస విషయానికొస్తే సేమ్ టు సేమ్. హిందీ-ఉర్దూ మిళితమై వినసొంపుగా ఉండే దక్కని యాసలోనే ఇక్కడి ప్రజలు మాట్లాడుతారు.