హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సారే స్ఫూర్తి అని, వారే మూల స్తంభాలు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. 25 ఏండ్ల పార్టీ ప్రస్థానానికి, ఆ ఇద్దరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమని తెలిపారు. ఆదివారం ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు బయలుదేరే ముందు తెలంగాణభవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ దండం పెట్టారు. శాసనమండలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, పొన్నాల లక్ష్మయ్య, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అమరవీరుల అశీస్సులు, పెద్దల ఆశీర్వాదాలతో మరో 25 ఏండ్లు తెలంగాణ సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘బీఆర్ఎస్ 25 ఏండ్ల సంబురం’ పుస్తకాన్ని ఆవిష్కరణ
బీఆర్ఎస్ 25 ఏండ్ల సంబురం పేరుతో రూపొందించిన పుస్తకాన్ని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని సీనియర్ పాత్రికేయులు కోటిరెడ్డి, బాలకృష్ణ, మాలతి, తేజ రూపొందించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు జరిగిన ఉద్యమ ఘట్టాలను పుస్తకంలో పొందుపరిచారు.
తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు పేరుపేరునా ఆదివారం తన ఎక్స్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.‘తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చి ఈ సభను విజయవంతం చేశారని కొనియాడారు.