హైదరాబాద్, ఆగస్టు 28( నమస్తే తెలంగాణ): వైన్‌షాపుల్లో గౌడ్లకు 15శాతం కేటాయించాలని నిర్ణయించడం అన్యాయమని, వెంటనే ఇందుకు సంబంధించిన జీవో-93ను రద్దుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 25 శాతం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. గురువారం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో గౌడ కులసంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ‘కల్తీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా మూసివేసిన కల్లు దుకాణాలను తెరిపించాలి.
గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి పెండింగ్ పరిహారాన్ని విడుదల చేయాలి. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. కేరళలో మాదిరిగా 8.98 శాతం ఆల్కహాల్‌తో కల్లుగీత పాలసీని అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలసాని బాలరాజ్, కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, గౌడ జనహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.