మహబూబ్‌నగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిందామంటే భయం.. గురుకులాల్లో ఉందామంటే భయం.. కేజీబీవీలో చదవాలంటే భయం.. ఇదీ ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాగనూరు జడ్పీహెచ్ఎస్లో బుధవారం సగానికిపైగా హాజరుశాతం తగ్గిపోయింది. జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎడ్యుకేషనల్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి మధ్యాహ్న భోజనాన్ని వండించాల్సిన పరిస్థితి నెలకొన్నది. వనపర్తి జిల్లా మదనాపురం గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ప్రవీణ్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది.
నవాబ్‌పేట మండలంలో కేజీబీవీ విద్యార్థిని జల్సా చేత పూరీలు చేయిస్తుండగా, కాగుతున్న నూనె మీద పడి గాయాలయ్యాయి. మరోవైపు మాగనూరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నారాయణపేట జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేశారు. పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాఠశాలలో ఉండటంతో మీడియాను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులు తమను పరామర్శించేందుకు వచ్చిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని నిలదీశారు. ఫుడ్ పాయిజన్ అయిన మాగనూరు ఉన్నత పాఠశాల ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తారని భావించిన పోలీసు యంత్రాంగం తెల్లవారు జామునే మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, విపక్షాలు చేపట్టిన ఆందోళనలను సైతం భగ్నం చేసి 42 మందిని అరెస్ట్ చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూరు ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఇది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న పరిస్థితి. విద్యార్థులను స్కూలుకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో బుధవారం జరిగిన వరస ఘటనలు ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరుకు అద్దం పడుతుండగా సీఎం సొంత జిల్లాలో జరుగుతున్న ఘటనలు కలవర పెడుతున్నాయి.
సగానికి తగ్గిన హాజరు శాతం
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీహెచ్ఎస్లో బుధవారం 590 మంది విద్యార్థులకుగాను 330 మంది మాత్రమే హాజరయ్యారు. మంగళవారం 460 మంది విద్యార్థులు హాజరుకాగా.. మళ్లీ ఫుడ్‌పాయిజన్ అయ్యి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో చాలామంది విద్యార్థులు పాఠశాలకు రాలేదు. వచ్చిన విద్యార్థుల్లో సగం మంది ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు తీసుకొనిరావడం కనిపించింది.
12:57కు భోజనానికి వదిలిన ఉపాధ్యాయులు
రాష్ట్ర సూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి.. కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేశ్గౌతమ్తో కలిసి మాగనూరు పాఠశాల పరిసరాలను బుధవారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనానికి వాడిన బియ్యాన్ని, వంట గదిని పరిశీలించారు. నాణ్యమైన వస్తువులను వాడుతున్నారా? లేదా అనే విషయంపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 గంటలు దాటినా విద్యార్థులకు భోజనం పెట్టలేదు. దీంతో 12:45కు ఏడో తరగతి విద్యార్థిని అను ఆకలితో క్లాస్‌రూంలో బాధపడుతుండగా డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి గుర్తించి పాఠశాల బయటకు తీసుకెళ్లారు. సదరు విద్యార్థిని ప్రజలను చూసి భయభ్రాంతులకు గురై తిరిగి క్లాస్‌రూంకు వెళ్లి ఆకలితోనే కూర్చున్నది. అధికారులు ఫుడ్‌పాయిజన్‌పై గంటల తరబడి సమీక్ష జరుపుతున్నారే కానీ, సమయానికి భోజనం పెట్టాలన్న ధ్యాస లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చివరికి 12:57కు విద్యార్థులను భోజనానికి వదిలారు.
ఐదుగురితో కమిటీ వేసిన కలెక్టర్
మాగనూరు ఫుడ్‌పాయిజన్ నేపథ్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించేందుకు జిల్లా కలెక్టర్ ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వంట ఏజెన్సీకి చెందినవారు ఉంటారు. ప్రతిరోజూ భోజనం ప్రారంభమయ్యే ముందు సరుకులన్నీ పరిశీలించాక భోజనాన్ని వండుతారు. ముందుగా కమిటీ సభ్యులు తిన్నాక విద్యార్థులకు భోజనం అందజేస్తారు. కాగా ఫుడ్‌పాయిజన్‌కు గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల నుంచి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు
మాగనూరు జడ్పీహెచ్ఎస్లో వరుస ఫుడ్‌పాయిజన్ ఘటనలపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఎందుకిలా జరుగుతున్నదని అధికారులపై మండిపడ్డారు. బియ్యం ఇతర వస్తువులు అన్నీ మార్చినా ఎందుకు విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయని ప్రశ్నించారు. దీనికి గల కారణాలను వివరించాలంటూ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, జిల్లా కలెక్టర్ వెంటనే సీసీ కెమెరాలు తెప్పించి బిగించారు. క్లాస్ రూములు, వంటగదులు, పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అంతా సవ్యంగా ఉన్నదని మీడియాతో వివరించారు.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
మాగనూరు ఫుడ్‌పాయిజన్ ఘటనపై స్పందిం చి విద్యార్థులను పరామర్శించిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని తెల్లవారుజామున మక్తల్‌లో అరెస్టు చేశారు. ఉదయం 5 గంటలకు ఇంటి కి వెళ్లిన పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి మద్దూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అప్పటికే చేరుకున్న బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే అరెస్టును అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా ఆయనను వాహనంలో తరలించారు. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసనగా జాతీయ రహదారిపై ఆ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో మక్తల్ పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాగనూరులో పోలీసులు 144 సెక్షన్ విధించి ఆందోళనకు దిగిన బీఆర్ఎస్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ, బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని 42 మందిపై కేసు నమోదుచేశారు. పాఠశాల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షించారు.
ఇంటి నుంచి భోజనం
మాగనూర్ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. బుధవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు ఇంటినుంచే లంచ్ బాక్సులు తెచ్చుకున్నారు. వాటినే మధ్యాహ్నం భుజించారు. వారిని ‘నమస్తే తెలంగాణ’ బృందం పలకరించగా వారం రోజులుగా ఫుడ్‌పాయిజన్ అవుతుండటంతో అన్నం తినాలంటేనే భయమేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలలో 590 మందికి 338 విద్యార్థులు హాజరు కాగా.. చాలామంది ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్నే తిన్నారు.
మేం కుర్కురే తిన్నమని ఎట్ల చెప్పిండ్రు?
ఎమ్మెల్యేను నిలదీసిన విద్యార్థులు
ఫుడ్‌పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురై మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బయట చిరుతిళ్లు తిన్నారని వ్యాఖ్యానించారు. దీంతో ‘మేము బయట ఫుడ్ తినలేదు. మీరు అలా ఎందుకు చెప్పారు? మేం కుర్కురే తిన్నమని ఎట్ల చెప్పిండ్రు?’ అంటూ విద్యార్థినులు ఎమ్మెల్యేను నిలదీశారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయన బయటికి వచ్చి మీడియాతో సందర్భంలేని మాటలు మాట్లాడి వెళ్లిపోయారు.