హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి, అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో చర్చించి పోటీ విషయమై ప్రకటిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో చేపడుతున్న కార్యక్రమాల గురించి ‘నమస్తే తెలంగాణ’ ముంబై ప్రతినిధితో కదం ఫోన్లో మాట్లాడారు. దానికిగాను అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించామని తెలిపారు. 20 లక్షల 85 వేల మంది పార్టీలో క్రియాశీల సభ్యులున్నారని తెలిపారు. రానున్న రెండు నెలల్లో రెండు కోట్ల మందిని క్రియాశీలక సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని 17 వేల గ్రామాల్లో పార్టీ పదాధికారులు, నాయకులు ఈ మేరకు కృషి చేస్తున్నారని వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఒక సమన్వయకర్తను నియమించామని, వారికి అన్నిరకాల శిక్షణ ఇచ్చామని తెలిపారు.
ఒకొకరికీ ఒక ట్యాబ్తోపాటు పార్టీ ప్రచార సామగ్రిని అందజేశామని చెప్పారు. పార్టీ విస్తరణ కోసం కొంకణ్, నాసిక్, ఔరంగాబాద్, నాగ్పూర్, పుణె, అమరావతి విభాగాల్లో ఆఫీస్ భవనాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హరిబావు రాథోడ్, ధర్మన్న సాదుల్, శంకరన్న ధోండ్గే, భానుదాస్ మురుటే, చరణ్ వాగ్మారే, రఘునాథ్ దాదా, భగీరథ బాలే తదితర దిగ్గజ నేతలతోపాటు ముగ్గురు మాజీ ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదం పడిందని తెలిపారు. మహారాష్ట్రలో దళిత, ఓబీసీ, యువత, మహిళా తదితర విభాగాల్లో 9 కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఊరూరా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ ప్రచార, ప్రసార బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. మహారాష్ట్ర ఇన్చార్జి కే వంశీధరరావు నేతృత్వంలో అన్ని పార్టీలకు ధీటుగా తమ పార్టీ కూడా పోటీలో నిలుస్తుందనడంలో సందేహంలేదని మాణిక్ కదం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని మాణిక్ కదం ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.