KCR : తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్‌ను ఆజన్మ తెలంగాణవాదిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీర్తించారు. జయశంకర్ సార్ తెలంగాణ గురించి చేసిన పోరాటాలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడుడే కష్టంగా ఉండెనని, నాటి శాసనసభ స్పీకర్ ప్రణయభాస్కర్ తెలంగాణ అనే పదం ఉపయోగించవద్దని చెప్పారని, వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభముఖంగా వ్యాఖ్యానించారని కేసీఆర్ గుర్తుచేశారు. జయశంకర్ సార్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు.
‘ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి చెప్పేవారు. ఈ సందర్భంలో ఆయనను స్మరించుకోకుండా నేను ఉండలేను. అలాంటి మనుషులు ప్రపంచంలో అరుదుగా ఉంటారు’ అని కేసీఆర్ అన్నారు.
‘మీ ప్రస్థానం ఎలా మొదలైంది సార్ అని జయశంకర్ సార్‌ను అడిగితే.. ఆంధ్రావాళ్లు చేసిన హేళనల గురించి చెప్పారు. నాడు హైదరాబాద్ రాష్ట్రంలో తన బాల్యంలో వరంగల్‌లోని మర్కజి స్కూల్లో జరిగిన సంఘటన గురించి చెప్పారు. నాడు ఆ స్కూల్లో ఆయన విద్యార్థి. ఆ పాఠశాలకు ఆంధ్రా ప్రాంతం నుంచి అయ్యదేవర కాళేశ్వర్రావు లాంటి వాళ్లు వచ్చి తెలంగాణను ఎగతాళి చేసేవారు. తెలంగాణ వాళ్లను ఆంధ్రాతో విలీనానికి మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఒకసారి అయ్యదేవర కాళేశ్వర్రావు మర్కజి స్కూల్‌కు వచ్చి తెలంగాణ భాష గురించి అవమానకరంగా మాట్లాడారని, దాంతో తోటి విద్యార్థులతో కలిసి తాము జై తెలంగాణ నినాదాలు చేశామని, అతనిపై రాళ్లు విసిరామని చెప్పారు. అప్పుడు తమపై లాఠీచార్జి చేశారని తెలిపారు. అదే తెలంగాణ ప్రాంతంలో జరిగిన తొలి లాఠీ చార్జి’ అని కేసీఆర్ చెప్పారు.
‘ఆ సంఘటనతో ఆయన తెలంగాణ అస్థిత్వం కోల్పోవద్దని, తెలంగాణ తెలంగాణగనే ఉండాలని నిర్ణయించుకుని పోరాట పంథా ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్ సార్ బెదరలేదు. పోరాట పంథాను వీడలేదు. అలా అనేక సందర్భాల్లో ఆయన బెదిరింపులను ఎదుర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని అణచడం కోసం నాటి ప్రభుత్వాలు చేసిన ఘోరాలు అన్నింటికి ఆయన సాక్షి. 1969 ఉద్యమంలో కూడా చాలా మంది పెద్దలు పోరాటం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన విజయసింహారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పోరాటంలో అగ్రభాగాన ఉండేవారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1969లో ఇక్కడి పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉంటూ అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. వాళ్లందరికి మనం తలెత్తి మొక్కాల్సిందే’ అని కేసీఆర్ అన్నారు.