తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. సీనియర్ జర్నలిస్టుగా, ఉద్యమకారునిగా వారు అందించిన సేవలు, బీఆర్ఎస్ పార్టీ కోసం వారు చేసిన కృషి గొప్పవని కొనియాడారు.
సత్యనారాయణ మృతితో తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇతర బీఆర్ఎస్ నాయకులు ఆర్. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా , తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా సత్యనారాయణ తనదైన ముద్ర వేశారని.. తెలంగాణ ఉద్యమంలో వారి కృషి, బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయమని సత్తన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.