KCR | హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తుమ్మబాల కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ తుమ్మబాలతో తనకున్న పరిచయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
వరంగల్ ప్రాంత వాసి అయిన తుమ్మబాల క్రీస్తు సేవ కోసం తన జీవితాన్ని అర్పించారని కేసీఆర్ అన్నారు. ఆధ్యాత్మిక సేవలో తుమ్మబాల అత్యున్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
వరంగల్ జిల్లా నర్మెట్టలో 1944 ఏప్రిల్ 24న జన్మించారు. పోప్ సెయింట్ జాన్ పాల్ II ద్వారా 1986 నవంబర్ 17న వరంగల్ రెండో బిషప్గా నియమితులయ్యారు. అక్కడ దాదాపు 25 ఏళ్లపాటు సేవలందించారు. అనంతరం తుమ్మబాలను 2011 మార్చి 12 హైదరాబాద్ ఆర్చ్ బిషప్గా పోప్ బెనడిక్ట్ నియమించారు. 2020లో ఆర్చ్ బిషప్గా పదవీ విరమణ చేసిన ఆయన హనుమకొండ జిల్లా కరుణాపురంలోని దివ్యజ్యోతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం సాయంత్రం కన్నుమూశారు.