BRS Party | (నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి);మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణి కొట్టింది. తెలంగాణ అవతల బ్యాలెట్ సమరంలో తొలి రికార్డు నమోదు చేసింది. ఒక వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయి జైత్రయాత్రలో ఇది తొలి అడుగు. ఔరంగబాద్ జిల్లా గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామంలో ఒకటో నంబర్ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్దార్ గఫూర్ పఠాన్ 115 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గఫూర్ పఠాన్ ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. ఎన్నిక ఫలితం శుక్రవారం ఉదయమే వెలువడింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాందేడ్‌కు చేరుకున్న సమయంలోనే ఫలితం వెలువడటం యాదృచ్ఛికం. బీఆర్ఎస్ విజయం స్థానికంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో బీజేపీ బొక్కబోర్ల పడ్డ సందర్భంలో బీఆర్ఎస్ మహారాష్ట్రలో బోణీకొట్టడం గమనార్హం.
బీఆర్ఎస్ అభివృద్ధికి ప్రజల ఓటు: సతీశ్‌రెడ్డి
మహారాష్ట్రలో గఫూర్ పఠాన్ విజయం సాధించడం బీఆర్ఎస్ అభివృద్ధి రాజకీయానికి ప్రజలు ఓటు వేశారనడానికి నిదర్శనమని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మత రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 31 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారని చెప్పారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.