చింతలమానేపల్లి, డిసెంబర్ 5: ‘బీఆర్ఎస్ బలపరిచిన మహిళా సర్పంచ్ అభ్యర్థి బరిలో నుంచి తప్పుకోవాలి. లేదంటే అంతు చూస్తాం. తీవ్ర పరిమాణాలు తప్పవు’ అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఆ అభ్యర్థి మామ తలపై తుపాకీ పెట్టి బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆపై దళం పేరిట లేఖ ఇచ్చి అక్కడి నుంచి అదృశ్యమైన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రణవెల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది. రెండోవిడుత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన జాడి దర్శన నామినేషన్ వేశారు. ఆమెకు బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు ఇస్తున్నారు. అభ్యర్థి దర్శన మామ అయిన బాపు, ఆయన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి పశువులను మేపుకొని సాయంత్రం ఇంటికి తోలుకొస్తున్నారు. ఈ సందర్భంగా స్కూటీపై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి బాపు వద్దకు వెళ్లాడు. ‘అంకుల్ ఆగు.. మీరు రంజిత్ నాన్నే కదా’ అని అడిగాడు.
ఆయన అవునని చెప్పడంతో.. అతని చేతిలో బెదిరింపు లేఖ పెట్టాడు. ‘సర్పంచ్‌గా మీకు ఫాలోయింగ్ మంచిగున్నది. ఇప్పటికే రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. వెంటనే పోటీ నుంచి తప్పకోవాలి’ అని ఆ వ్యక్తి ఆదేశించాడు. ఈ విషయం గ్రామస్థులకు, పోలీసులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ తలపై తుపాకీ గురిపెట్టాడు. దీంతో బాపు భయంతో ఆయన నుంచి తప్పించుకొని ఊరిలోకి పరిగెత్తాడు. జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో రాత్రి కుటుంబసభ్యులతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కౌటాల సీఐ సంతోశ్‌కుమార్, ఎస్సై నరేశ్ శుక్రవారం ఉదయం గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. బాధితుడి ఇంటివద్ద, ఊరిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని, నిందితుడిని పట్టుకొని తీరుతామని స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో ఎన్ని బెదిరింపులకు దిగినా బరిలో నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని సర్పంచ్ అభ్యర్థి దర్శన, ఆమె కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరిరోజు కావడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొన్నది. పేద వర్గానికి చెందిన తమకు రిజర్వేషన్ అనుకూలించి, ప్రజల కోరిక మేరకు నామినేషన్ వేస్తే ఇలా బెదిరింపులు రావడంపై దర్శన ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కుటుంబాన్ని బెదిరించిన దుండగులను పోలీసులు బయటపెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోనప్ప డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించడం చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఈ విషయంపై అభ్యర్థి కుటుంబాన్ని ఓదార్చినట్టు చెప్పారు.