కందుకూరు, జూలై 7 : ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయమైన పరిహారం దక్కాలని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వార్తలు రాసిందని తాము కూడా రైతుల పక్షాన నిలదీయడంతో ఎట్టకేలకు ప్లాట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కందుకూరు మండల పరిధి మీర్ఖాన్పేట రెవెన్యూ పరిధిలో ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు లాటరీ పద్ధతి ద్వారా సోమవారం ప్లాట్లను కేటాయించారు. కార్యక్రమానికి ఆమె హాజరై భూములిచ్చిన రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘మీ కృషి వల్లే మాకు ప్లాట్లు వస్తున్నయి’ అని ఆనందపడ్డారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం భూములను తిరిగి రైతులకు ఇవ్వకుండా కాంగ్రెస్ తమ పార్టీపై బురద చల్లుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతున్నదని విమర్శించారు. ఓ సారి ఫార్మాసిటీ ఉంటుందని? లేదు రద్దు చేశామని? కాదు కాదు.. గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారని, ఇందులో ఏది నిజమో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రైతులకు నష్టపరిహారం సరిపోవడం లేదని తాను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారంతో పాటు అదనంగా ఎకరానికి 121 గజాల ప్లాట్ చొప్పున ఇవ్వాలని కోరగా కేసీఆర్ అంగీకరించినట్టు తెలిపారు. ఎన్నికల ముందు లే అవుట్ చేశామని, ఎన్నికల కోడ్ సందర్భంలో పనులు నిలిచిపోయాయని, ఆ తరాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, దీంతో 18 నెలలుగా రైతులకు ప్లాట్లు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిందని తెలిపారు.
ప్లాట్లు అమ్ముకోవద్దు..
ప్లాట్లను రైతులెవరూ అమ్ముకోవద్దని సబితారెడ్డి కోరారు. ఈ ప్లాట్లలకు మంచి భవిష్యత్తు ఉన్నదని తెలిపారు. చాలామంది బ్రోకర్లు, దళారులు కారుచౌకగా ఈ ప్లాట్లను కొనాలని చూస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయల లోపు పలుకుతున్న ఈ ప్లాట్లు మున్ముందు కోట్లల్లో పలుకుతాయని, ఇప్పుడుఅమ్మి మోసపోవద్దని సూచించారు.
రైతులపై ఆంక్షలా?
కాగా కార్యక్రమంలో రైతులపై అంక్షలు విధించడంపై సబిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మా రైతులకు లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు రాగా వారిని అడ్డుకునేందుకు పెట్టిన బారికేడ్లను, పోలీసుల తనిఖీలను చూసి రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మహేశ్వరం డీసీసీ సునీతారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రైతులంతా ఒకేసారి వస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈరోజు 60 గజాలుఉన్న రైతులనే అనుమతినిస్తున్నామని, ఆంక్షలు లేవని వివరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురసాని సురేందర్ రెడ్డి, గంగాపురం లక్ష్మీ నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురసాని రాజశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ పొట్టి ఆనంద్, మాజీ సర్పంచులు బ్రాహ్మణపల్లి జ్యోతి చంద్రశేఖర్, ఢిల్లీ సరళమ్మ పాండు, దేవేందర్, సదానంద్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సామయ్య, కార్యదర్శి వెంకటేశ్, రాము గుప్తా, సురసాని సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణ, వెంకటేశ్ ఉన్నారు.
మాటమార్చిన ఎమ్మెల్యే మల్రెడ్డి ;గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
ఫార్మాసిటీ విషయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాటమార్చారు. ఫార్మాసిటీ పూర్తిగా రద్దయ్యిందని, ఇంకెక్కడి ఫార్మాసిటీ అన్న మల్రెడ్డి గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో ఫార్మా బాధిత రైతులకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొల్యూషన్లేని గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు పైసా ఖర్చులేకుండా ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తున్నామని, రేడియల్ రోడ్డు వెళ్తుండడంతో భవిష్యత్తులో ఈ ప్లాట్లు బంగారం కంటే ఎక్కువ విలువ చేస్తాయని తెలిపారు. పట్టాభూములకు సంబంధించిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామ చెప్పారు.
ప్లాట్లను అమ్ముకోవద్దు: కలెక్టర్
ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు భవిష్యత్తులో బంగారం కంటే ఎక్కువ విలువ చేస్తాయని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. 600ఎకరాల్లో విశాలమైన రోడ్లు, అత్యాధునిక హంగులతో వెంచర్ ఏర్పాటు చేశామన్నారు. 5,800మంది రైతులకు ప్లాట్లను కేటాయించనున్నట్టు తెలిపారు. మొదటిరోజు కందుకూరు, మహేశ్వరం మండలాల్లోని 670 మందికి ప్లాట్లు కేటాయించామని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శశాంక పాల్గొన్నారు.