818 ఎకరాలు తాకట్టు
కంచె గచ్చిబౌలి.. తెలంగాణ సమాజమే కాదు! యావత్ భారతదేశానికి రేవంత్ సర్కార్ ఘనకార్యాన్ని చూపిన వేదిక. రికార్డు ధరలతో దేశ రియల్ ఎస్టేట్ రంగాన్నే ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాద్ పరిధిలోని విలువైన భూములను అగ్గువకు అంగడిలో తెగనమ్మేందుకు ప్రయత్నించిన ఉదంతానికి కంచె గచ్చిబౌలి నిలువెత్తు సాక్ష్యం.
- కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
- ప్రభుత్వ వేలంలో ఎకరం రూ.200 కోట్లకు పైగా పలుకుతున్న ధర
- హెచ్ఎండీఏ భూములకు ఎకరం కేవలం రూ.15 కోట్లుగా నిర్ధారణ
- 12,818 కోట్లకే 818 ఎకరాలు కుదువ.. వచ్చింది 9,754 కోట్లే!
- హెచ్ఎండీఏ బాండ్లపై 8.5-8.7 శాతం వడ్డీతో మళ్లీ రుణ సేకరణ
- ఆ తనఖా భూముల్లో పాగా వేసిన ‘ముఖ్యనేత’ సన్నిహిత కంపెనీ
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): కంచె గచ్చిబౌలి.. తెలంగాణ సమాజమే కాదు! యావత్ భారతదేశానికి రేవంత్ సర్కార్ ఘనకార్యాన్ని చూపిన వేదిక. రికార్డు ధరలతో దేశ రియల్ ఎస్టేట్ రంగాన్నే ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాద్ పరిధిలోని విలువైన భూములను అగ్గువకు అంగడిలో తెగనమ్మేందుకు ప్రయత్నించిన ఉదంతానికి కంచె గచ్చిబౌలి నిలువెత్తు సాక్ష్యం. కాంగ్రెస్ ప్రభు త్వం ఒకవైపు వేలంలో ఎకరా రూ.200 కోట్లకుపైగా ధర పలికిందని చెప్తూనే.. మరోవైపు హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను మాత్రం ఎకరా రూ.75 కోట్లకు ధారాదత్తం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. దానికోసం అడవిని సైతం నేలమట్టం చేసింది.
కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతోపాటు యూనివర్సిటీ విద్యార్థులు, బీఆర్ఎస్ చేసిన సంఘటిత పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజలకు చెందిన దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన భూములకు రక్షణ దొరికింది. అయినా హైదరాబాద్ భూములపై రేవంత్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. కంచె గచ్చిబౌలి తరహాలో.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా మరో భూ బాగోతానికి తెరలేపింది. ఈసారి హెచ్ఎండీఏ సంస్థను వేదికగా చేసుకున్నది. చడీచప్పుడు లేకుండా ఏకంగా 818 ఎకరాలను జాతీయ మార్కెట్లో ఉంచి, సుమారు రూ.10వేల కోట్లను ఖజానాలో వేసుకున్నది.
ఇంతకీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టిన భూములకు వచ్చిన ధర ఎంతో తెలుసా? ఎకరాకు కేవలం రూ.15 కోట్లే. అంటే.. దాదాపు రూ.40-80వేల కోట్ల వరకు ధర పలికే భూములను చవకగా తనఖా పెట్టిందన్నమాట. ఇక్కడ మరో కీలక విషయం.. కంచె గచ్చిబౌలి ఎపిసోడ్లో బ్రోకర్‌గా వ్యవహరించిన ముంబైకి చెందిన బీకన్ ట్రస్టీషిప్ అనే కన్సల్టెంట్ సంస్థనే తాజాగా భూముల తాకట్టులోనూ మధ్యవర్తిత్వం వహించింది. ఈ బాగోతాన్ని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ బయటపెట్టారు.
కంచె గచ్చిబౌలిలోనూ అగ్గువకే..
సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూములను రెండేండ్ల కిందట రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి బదలాయిస్తూ ప్రభుత్వం జీవో 54 జారీ చేసింది. అందులో భూముల ధర ఎకరా రూ.75 కోట్లుగా నిర్ధారించారు. అంటే ఎకరా రూ.75 కోట్ల చొప్పున 400 ఎకరాల విలువ రూ.30వేల కోట్ల పైమాటే. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఈ భూములు ఎకరం రూ.100 కోట్ల వరకు పలుకుతాయి.
ఇప్పుడూ అదే తరహాలో..
కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు సమయంలో కనీసం విషయం లీకయ్యింది. కానీ ఇప్పుడు మాత్రం హెచ్ఎండీఏ బాండ్ల జారీ ద్వారా రుణం సేకరించేందుకు, ఏకంగా 817.32 ఎకరాల భూములను తాకట్టు పెట్టింది. రూ.10వేల కోట్లు అప్పు తెచ్చిన విషయం మాత్రం ఇసుమంతైనా బయటికి రాలేదు. చివరికి ప్రభుత్వ అనుకూల మీడియాకు సైతం లీకులు ఇవ్వకుండా జాగ్రత్తపడటం వెనక లోగుట్టు పెరుమాళ్లకెరుక. కాగా గతంలోనే రెవెన్యూ శాఖ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ అయిన వివిధ ప్రాంతాల్లోని భూములను ఇప్పుడు ప్రభుత్వం తాకట్టు పెట్టింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్ నగర్‌లోని సర్వేనెంబరు 5/2, 5/23లో 26.25 ఎకరాలు, శంకర్పల్లి మండలం మోకిల సర్వేనెంబర్ 96లోని 41-12 ఎకరాలు, శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వేనెంబర్ 20/1లోని 105 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సర్వేనెంబర్ 496లోని 27.20 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ సర్వేనెంబర్ 126/పీలోని 22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సర్వేనెంబర్ 472లోని 49.03 ఎకరాలు, ఇదే జిల్లా పటాన్చెరు సర్వేనెంబర్ 639లోని 17.20 ఎకరాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వేనెంబర్ 220/పీలోని 44.32 ఎకరాలు, ఇదే జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్ సర్వేనెంబర్ 12లోని 449 ఎకరాలు, సర్వేనెంబర్ 706లోని 35 ఎకరాలు… ఇలా మొత్తం 817.32 ఎకరాల తెలంగాణ సంపదను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంది.
ఎకరా ధరను ఎంతకు నిర్ణయించింది?
కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల తాకట్టులో ముంబైకి చెందిన బీకన్ ట్రస్టీషిప్ కన్సల్టెన్సీ మధ్యవర్తిత్వం వహించింది. రూ.10వేల కోట్లు తెచ్చినందుకు బ్రోకర్ ఫీజు కింద రూ.169 కోట్లు తీసుకున్నది. ఇప్పుడు 818 ఎకరాల వ్యవహారంలోనూ ఈ సంస్థే మధ్యవర్తిత్వం వహించింది. రూ.వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును అప్పనంగా తీసుకుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది మార్చి 20న ఈ భూములకు సంబంధించిన విలువను సంబంధిత కన్సల్టెన్సీ ద్వారా లెక్కించింది. వాటి మార్కెట్ విలువను రూ.12818.63 కోట్లుగా తేల్చారు. అంటే ఎకరా ధర కేవలం రూ.15.17 కోట్లు. కొన్ని ప్రాంతాల్లో ఎకరా ధర రూ.100 కోట్లకు పైమాటే. సరాసరిన ఎకరా ధర కనీసంగా రూ.50 కోట్లుగా లెక్కించినా ఈ భూముల విలువ రూ.40వేల కోట్ల వరకు ఉంటుంది. కానీ రేవంత్ ప్రభుత్వం ఈ విలువలో నాలుగో వంతును ధరగా నిర్ణయించడమంటే ఎంత అగ్గువకు తాకట్టు పెట్టిందో చెప్పవచ్చు.
వచ్చిందెంత?
ప్రభుత్వం రూ.40 వేల కోట్ల విలువైన భూముల విలువను మార్కెట్లో పెడితే వచ్చింది రూ.9754.26 కోట్లు మాత్రమే. అంటే ఎకరా ధర రూ.11.92 కోట్లు. ఎంత ఆపదలో ఉన్నవాళ్లు అయినా ఇంత అగ్గువకు భూములను వదులుకోరు. హెచ్ఎండీఏ తెచ్చిన మొత్తంలో రూ.3,278.96 కోట్లను 8.70 శాతం వడ్డీకి, మిగతా రూ.6475.30 కోట్లను 8.50 శాతం వడ్డీకి తీసుకున్నది. హెచ్ఎండీఏ బ్యాలెన్స్ షీట్ ఇందుకు ఆధారం. ఈ ఏడాది మార్చి 31 వరకు హెచ్ఎండీఏ సేకరించిన అప్పుల వివరాల్లో రూ.275.91 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది జూన్ 30న పరిశీలించగా రూ.10,030.17 కోట్లుగా ఉన్నది.
అమ్మిన భూముల తాకట్టు.. కబ్జా
జవహర్‌నగర్‌లోని సర్వేనెంబర్ 12లో ఉన్న 449 ఎకరాలను భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టింది. వాస్తవానికి అందులో 50 ఎకరాల భూమిని 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఐటీ కంపెనీ ఏర్పాటు కోసం జెన్‌ప్యాక్ట్ అనే కంపెనీకి ఇచ్చింది. ఎకరా రూ.25 లక్షల చొప్పున విలువ కట్టి కంపెనీ ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు అందులో ‘కబ్జా చేస్తే శిక్షార్హం’ అంటూ బోర్డు కూడా ఏర్పాటుచేసింది. ఇప్పుడు ఆ భూమిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంది. అంతేకాదు.. ఇప్పుడు ఆ భూమిలోకి పోయి చూస్తే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ కొత్తగా కంటెయినర్ తెచ్చి కబ్జా చేసింది. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితమైన కంపెనీ అని ప్రచారంలో ఉన్నది.
ఏమిటీ రౌండ్ ట్రిప్పింగ్?
రౌండ్ ట్రిప్పింగ్ రెండు రకాలు. ఒక వ్యక్తి లేదా సంస్థ తనకు లబ్ధి చేకూర్చినట్లయితే, ప్రతిఫలంగా సదరు వ్యక్తి లేదా సంస్థకు ప్రయోజనం చేకూర్చడాన్ని ‘రౌండ్ ట్రిప్పింగ్’గా అభివర్ణిస్తారు. వ్యక్తి లేదా సంస్థ తన వద్ద ఉన్న లెక్కల్లో చూయించని డబ్బునే వివిధ మార్గాల్లో తిప్పి తిరిగి తన దగ్గరికే వచ్చేలా చేసి నిజమైన పెట్టుబడిగా చూయించడాన్ని ఆర్థికరంగంలో ‘రౌండ్ ట్రిప్పింగ్’గా పిలుస్తారు.
తెచ్చినవాటితో ఏం చేసినట్లు
భూములను తాకట్టు పెట్టి తెచ్చిన సుమారు రూ.10వేల కోట్లను దేనికి వెచ్చించారనేది ఇప్పటివరకు ప్రజలకు వెల్లడించలేదు. కంచె గచ్చిబౌలిలో రూ.10వేల కోట్ల అప్పు తెచ్చినపుడు కూడా ఇదే మౌనాన్ని ప్రదర్శించారు. అయితే.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగడంతో ఓ మంత్రి తాము తెచ్చిన మొత్తంతో రైతు భరోసా, కాంట్రాక్టులకు బిల్లులు ఇచ్చినట్లుగా వెల్లడించారు. అయితే తాజాగా తెచ్చిన రూ.10వేల కోట్ల అప్పు మొత్తం హెచ్ఎండీఏ ఖాతాలో ఉన్నదా లేదా? అనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. ఆ డబ్బులు ఎవరికిస్తున్నారు? ఏ నిర్మాణం చేపట్టారు? రూ.వేల కోట్లు ఎక్కడికిపోతున్నాయి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మార్చి నుంచి ఇప్పటివరకు హెచ్ఎండీఏ పరిధిలో ఒక్క అదనపు పని కూడా జరగలేదని, పోనీ రాష్ట్రవ్యాప్తంగా చూసినా ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టిన దాఖలాలు లేవనేది స్పష్టమవుతుంది. మరి భూములను అగ్గువకు పెట్టి తెచ్చిన రూ.వేల కోట్లు ఎక్కడికి పోయాయనేది ప్రభుత్వమే చెప్పాలి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు గౌరమ్మ ఉయ్యాలో
ఎంగిలీ పూలమ్మ ఉయ్యాలో..
ఎన్నెన్ని సిత్రాలో ఉయ్యాలో
సొంత ఊరిలోన ఉయ్యాలో..
ఎంతెంత భూమాయ ఉయ్యాలో
ఎనుములోలె జొచ్చి ఉయ్యాలో..
ఎన్నెన్ని ఎకరాలు ఉయ్యాలో
మేలైన భూములూ ఉయ్యాలో.. మేసేసినారమ్మ ఉయ్యాలో
ఎకరాలు లేనోళ్లు ఉయ్యాలో
వందలా ఎకరాలు ఉయ్యాలో
సర్కారు భూములు ఉయ్యాలో.. సగవెట్టినారమ్మ ఉయ్యాలో
కంపెనీల పేర ఉయ్యాలో..
కబ్జాలే చేసిండ్రు ఉయ్యాలో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

