చందంపేట/రఘునాథపాలెం, డిసెంబర్ 6: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదన్న మనోవేదనతో ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుకు గురై మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిళ్ల గ్రామానికి చెందిన జటావత్ రాజీ, మేగ్యా దంపతుల కుమారుడు లాలూనాయక్ (35) దివ్యాంగుడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి ఆకర్షితుడై కేసీఆర్ పాలనకు మద్దతుగా బీఆర్ఎస్లో చేరి కార్యకర్తగా కొనసాగుతున్నాడు. కేసీఆర్ సర్కారు నెలనెలా అందించిన రూ.4 వేల పింఛన్తో ధీమాగా జీవనం సాగిస్తున్నాడు. ఇంతలో ఈ నెల 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. మూడ్రోజుల నుంచి అన్నం తినడం లేదని, ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సర్కారు ఓటమిని తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో బుధవారం జరిగింది. హర్యాతండాకు చెందిన మాలోతు బద్యా బీఆర్ఎస్ కార్యకర్తగా ఉంటూనే చిన్న రైతుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నెల 3న వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కేసీఆర్ మళ్లీ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పినా దిగులుగా ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు విషయం తెలుసుకొని దవాఖానకు వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బద్యా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్టు బీఆర్ఎస్ రఘునాథపాలెం మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ తెలిపారు.