రాష్ట్రంలో 11,865 ఎకరాల్లో ఏర్పాటు
545 మండలాల్లో 2,725 వనాలు
సెలవుల్లో పిల్లలు సేదతీరే కేంద్రాలు
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు (బీపీవీ) చిట్టడవులను తలపించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయి. అదే తరహాలో ఎక్కువ స్థలంలో తొలిదశలో ప్రతి మండలంలో ఐదు బీపీవీలను ఏర్పాటు చేస్తున్నారు. 545 మండలాల్లో 2,725 బీపీవీలు చేపట్టనున్నారు. ఒక్కో వనాన్ని ఐదు నుంచి పది ఎకరాల్లో నెలకొల్పుతారు. 2,725 బీపీవీలకు 11,865 ఎకరాలను సేకరించారు. ఇందుకు రూ.272.87 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇప్పటివరకు రూ.35 కోట్లు వెచ్చించారు.
ఇప్పటికే 675 బీపీవీలు పూర్తయ్యాయి. మిగిలిన వాటి పనులు కొనసాగుతున్నాయి. వేసవి కావడంలో మొక్కలు బతకడం కష్టమనే ఉద్దేశంతో వర్షాకాలం ప్రారంభంకాగానే పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని భావిస్తున్నారు. మియావాకీ పద్ధతుల్లో మొక్కలు నాటుతున్నారు. గ్రామాల్లో సాయంత్రం వేళల్లో వృద్ధులు కాలక్షేపం చేయడానికి, సెలవుల్లో పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన బీపీవీలు ఎంతగానో ఉపయోగపడుతాయని అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లాలో వంద శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 87 శాతం, వనపర్తి జిల్లాలో 84 శాతం, సిరిసిల్ల జిల్లాలో 83 శాతం బీపీవీల పనులు మొదలయ్యాయి. వరంగల్, హనుమకొండ, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో పనులు కాస్త నెమ్మదిస్తున్నట్టు గుర్తించారు.