SLBC Tunnel | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) నడుస్తున్నప్పుడు పైనున్న కొండలు అదురుతున్నాయి.. నీటి ఊటలు.. మట్టితో కలిసి పడుతున్నాయి.. ప్రమాదం ఉందని ముందే తెలిసినప్పటికీ.. సర్కార్ ఆదేశాలతో పనులు చేపట్టిన కంపెనీ కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టింది. శ్రీశైలం ఎడమ గట్టు సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి కొద్దిరోజుల ముందు నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పటికీ పనులు చేపట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. సొరంగంలో పైకప్పు కూలి ఎనిమిది మంది చిక్కుకున్నప్పటికీ.. ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేదని భావించి సహాయక చర్యలను నిలిపివేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని.. లోపల ఉన్నవాళ్లు బతికే చాన్స్ లేదని రాష్ట్ర మంత్రి ఒకరు ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. లోపల చిక్కుకున్న తమవారి పరిస్థితి ఏంటని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు.
వారిని మీడియా ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. జరిగిన వాస్తవాన్ని కార్మికులు వెల్లడించకూడదనే ఉద్దేశంతో ఘటనాస్థలానికి వారిని రానివ్వడం లేదు. మిగతా కార్మికులు ఎక్కడ ఉన్నారో తెలియకుండా, మీడియాకు సమాచారం పొక్కకుండా దాచిపెట్టారు. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బంది, కూలీల కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. లోపల చిక్కుకున్న కార్మికులను వెంటనే తీసుకురావాలని, లేదంటే ఆందోళన నిర్వహిస్తామని మిగతా కార్మికులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయని చెబుతూ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సహాయక చర్యలు చేపట్టినా ఇప్పట్లో ఫలితం ఉండదని పేరు చెప్పని ఒక అధికారి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. అందుకే రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రులు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతూ విహారయాత్రగా మార్చుకున్నారు తప్పితే సహాయక చర్యలపై వారు ఏ మాత్రం సీరియస్‌గా లేరని విపక్షాలు మండిపడుతున్నాయి.
నిర్మాణ సంస్థకు ముందే తెలుసా?
ఎస్ఎల్బీసీ నిర్మాణంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని నిర్మాణ సంస్థకు ముందే తెలుసని కార్మికులు ఆరోపిస్తున్నారు. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు కొండగుట్టలు సైతం కదులుతున్నాయని.. ఇది పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించినా పనులు చేయాల్సిందేనని తమను పంపించారని కార్మికులు అంటున్నారు. కొండగుట్ట వదులుగా ఉందని.. లీకేజీలు ఎక్కువగా ఉండటంతో డ్రిల్లింగ్ మిషన్ లోపలికి వెళ్లిన కొద్ది పైకప్పుతో పాటు చుట్టుపక్కల మట్టి కూలుతూ వస్తున్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాణరంగ సంస్థ ఇంజినీర్లకు కూడా తెలియజేశారు. సర్కారు పనులు చేయమంటున్నది కాబట్టి.. ఎలాగైనా చేయాలని పట్టుబట్టిన కంపెనీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడింది. దీని పర్యవసానంగానే సొరంగంలో ప్రమాదం. రెండు కిలోమీటర్ల వరకు మూడు మీటర్ల ఎత్తున నీరు, బురద ఊబికి వస్తున్నట్టు తెలుస్తున్నది. సొరంగం చుట్టూ వేసిన కాంక్రీట్ రింగులు ఫోర్సుఫుల్గా వస్తున్న నీటి దాటికి నిలబడటంలేదు. కాంక్రీట్ దిమ్మెలు కుప్పకూలాయి. డ్రిల్లింగ్ మిషన్ ముందు ఉన్న వాళ్లు లోపల చిక్కుకుపోగా.. బయటి వారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డారు. భారీ శబ్దం చేస్తూ మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలడంతోపాటు డ్రిల్లింగ్ మిషన్ వెనక్కు తన్నుకు వచ్చింది. బురదలో మిషనరీ మొత్తం కూరుకుపోవడంతో చిక్కుకున్న వారిని చేరుకోవడం కష్టంగా మారింది. సహాయక చర్యలు చేపట్టిన బృందం వంద మీటర్లకు పైగా డ్రిల్లింగ్ మిషన్ అవతల పూర్తిగా కూలిపోయిందని అంచనాకు వచ్చారు. ఇందులోనే కార్మికులు చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ఇచ్చిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రెస్క్యూ బృందాలతో పాటు లోపలికి వెళ్లి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు బయటికి వచ్చాక.. లోపల చిక్కుకున్నవారు బతికి అవకాశం లేదని మీడియాకు తెలిపారు. పరిస్థితి దారుణంగా ఉందని.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ చివరివరకు కొనసాగిస్తామని చెప్పారు. శనివారం ప్రమాదం జరిగితే ఉదయం ఒకసారి లోపలికి వెళ్లి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించి ఆక్సిజన్‌ను అందించే ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన చోటును గుర్తించలేకపోయారు. అర్ధరాత్రి లోపలికి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆదివారం వివిధ బృందాలు సైన్యం సహాయంతో లోపలికి వెళ్లాయి. పరిస్థితిని అంచనా వేసి బయటికి వచ్చి మధ్యాహ్నం లోపలికి వెళ్లి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించారు. ప్రతికూల పరిస్థితులు ఉండడంతో రాత్రి తిరిగి వచ్చారు. మళ్లీ ఎప్పుడు వెళ్లేది ఉన్నతాధికారులు చెప్పడం లేదు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షిస్తున్న ఉన్నత అధికారి మాత్రం పది రోజులకుపైగా పట్టవచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఫోర్స్‌ఫుల్ వాటర్ లీకేజీలే కూలడానికి కారణం
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం పనులు 10 ఏండ్లుగా నిలిచిపోయాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మళ్లీ ఈ పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. వెంటనే పనులు చేపట్టాలని ముంబైకి చెందిన ఒక కంపెనీకి అప్పగించింది. సొరంగం లోపల 12వ కిలోమీటర్ల నుంచి లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. పైనుంచి ఉబికి వస్తున్న నీరు డ్రిల్లింగ్కు ఆటంకంగా మారింది. పరిస్థితి అంచనా వేయకుండా ముందుకు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
తమ వాళ్లను లోపలే వదిలేస్తారా?
ప్రమాదమని తెలిసి తమను లోపలికి పంపించారని, లోపల చిక్కుకున్నవారిని బయటికి తీసుకురావడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు. ఈ సొరంగ మార్గంలో పనిచేసే కార్మికులంతా ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన వారే. ఇతర రాష్ర్టాలకు చెందినవారు కావడంతో వారిని కనీసం ఘటన జరిగిన చోటుకు కూడా అనుమతించడం లేదు. కార్మికులు ఉంటున్న చోటును పోలీసులు దిగ్బంధించారు. అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కార్మికులకు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో మండిపడిన కొంతమంది కార్మికులు బయటకు వచ్చి మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ వాళ్లను రక్షించి బయటికి తీసుకురాకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
బయటకు తీసుకురావడం కష్టమే
టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం కష్టసాధ్యంగా మారింది. టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు నిలిచిపోయాయి. బురద, మెటీరియల్ అడ్డంకిగా మారాయి. రెండుసార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించాం. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే. కానీ ప్రయత్నిస్తాం.
-శ్రీనివాస్‌రెడ్డి, సింగరేణి క్వారీస్ జనరల్ మేనేజర్
టన్నెల్ ప్రమాదంపై గవర్నర్ ఆరా
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆరాతీశారు. ఈ విషయమై ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.