Sircilla | సిరిసిల్ల రూరల్, మార్చి 28 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఉన్నతాధికారి నిర్ణయం వివాదాస్పదమైంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి కక్ష సాధింపు ధోరణి అవలంబించినట్లు తెలుస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను మూసేసి, వేములవాడ నియోజకవర్గంలో మాత్రం కొనసాగిస్తుండడం విస్మయానికి గురిచేస్తున్నది. ఒకే జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ద్వంద్వ నిర్ణయాలు తీసుకుంటూ సదరు అధికారి వార్తల్లో నిలుస్తుండడం గమనార్హం. సిరిసిల్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిథ్యం వహించడంతో ఆయనపై ఆక్కసుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల, పెద్దూరు, నేరెళ్ల, ఎల్లారెడ్డిపేట, అల్మాస్పూర్, ముస్తాబాద్, పోత్గల్, గంభీరావుపేట, కొత్తపల్లి సింగిల్ విండోలు ఉన్నాయి. ఇవి దశాబ్ద కాలంగా రైతులకు రుణాల మంజూరీ, ఎరువులు, విత్తనాలతోపాటు మార్కెట్ సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుపై సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను వరి కొనుగోలు ప్రక్రియ నుంచి మినహాయిస్తూ ..ఇందిరాక్రాంతి పథం-మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో నిత్యం రైతులుకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధి తగ్గించినట్టయింది.
సిరిసిల్ల నియోజకవర్గంలోనే నిలిపివేత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే సింగిల్‌విండో ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సింగిల్‌విండో పాలకవర్గాలను ఇటీవలే ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. సిరిసిల్ల నియోజకవర్గంలో 10 సింగిల్‌విండోల్లో తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్కు చెందిన చైర్మన్లు ఉండగా, కేటీఆర్, బీఆర్ఎస్పై కక్షపూరితంగానే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సిరిసిల్ల కేంద్రంలో కేటీఆర్ పేరుపై ఫ్లెక్సీ ఉన్నందుకు అధికారులు టీస్టాల్ మూసివేయించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులతోపాటు జిల్లెల్లలో సామాన్య రైతు రాజిరెడ్డిని భూ ఆక్రమణ కేసు పెట్టి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
కేటీఆర్‌ను కలిసిన సింగిల్‌విండో చైర్మన్లు
సిరిసిల్ల నియోజకవర్గంలోని సింగిల్‌విండోల చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, కృష్ణారెడ్డి, కిషన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కిషన్‌యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి సమస్యను వివరించారు. ఈ విషయంపై ప్రభుత్వంతోపాటు సంబంధిత మంత్రులతో మాట్లాడతానని చైర్మన్లకు ఆయన హామీ ఇచ్చారు. సింగిల్‌విండోల కొనుగోలు నిర్వహణపై కలెక్టర్‌ను సైతం కలిసి లిఖితపూర్వకంగా విన్నవించినట్టు విండోల చైర్మన్లు తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి సింగిల్‌విండోల ద్వారా ధాన్యం కొనుగోళ్లను కొనసాగించాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.