TGGENCO | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీ జెన్కో.. ప్రైవేట్ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రంగం సిద్ధం చేసింది. బడా సంస్థలకు ప్రయోజనం కల్పించేందుకు ఏకంగా నిబంధనలనే సవరించింది. తద్వారా అత్యంత కీలకమైన సివిల్ వర్క్స్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ను బడా కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇదివరకు ఈ మెటీరియల్‌ను నేరుగా టీజీ జెన్కోనే సరఫరా చేసేది. జిందాల్, టాటా, వైజాగ్ స్టీల్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రిని కొనుగోలుచేసి, లేబర్ పనికి మాత్రమే టెండర్లు పిలిచేది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ లేబర్‌ను మాత్రమే సరఫరాచేసి, జెన్కో ఇచ్చిన మెటీరియల్‌తో నిర్మాణం చేపట్టేది. కానీ, ఇప్పుడు జెన్కో తన బాధ్యతల నుంచి వైదొలిగి పూర్తిగా ప్రైవేట్‌కు అప్పగించింది. దీంతో నాసిరకం నిర్మాణ సామాగ్రి వాడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీపీ)లో సిబ్బంది కోసం 1,000కిపైగా క్వార్టర్లతో భారీ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవలీ కాలంలో టీజీ జెన్కో చేపట్టిన నిర్మాణాల్లో ఇదే అతిపెద్దది. ఈ టౌన్షిప్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇదిలావుండగానే కొత్తగా సివిల్ పనుల నిర్మాణాల్లో ధరల మార్పునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆ క్వార్టర్ల నిర్మాణ టెండర్లకు బ్రేక్ పడింది. ధరల మార్పు నిబంధనను చేర్చి కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచేందుకు సంస్థ కసరత్తు చేస్తున్నది. మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ బాధ్యతను ప్రైవేట్‌కు అప్పగించడం, నిర్మాణ ధరల మార్పునకు అనుమతి ఇవ్వడం వెనుక పెద్ద గూడుపుఠాణీ దాగిఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధరల మార్పునకు అనుమతి ఇవ్వడంతో సివిల్ వర్క్స్ నిర్మాణ వ్యయం అమాంతం పెరగనుంది. వర్క్ తీసుకున్న తర్వాత సప్లిమెంటరీ రేట్ల పేరుతో ఇష్టారీతిన అంచనాలను పెంచుకునే అవకాశముంది. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉన్నట్టు జెన్కో ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. మొదట 1,500 కోట్లకు టెండర్ ఖరారు చేసిన ప్రాజెక్టు వ్యయాన్ని రేపు రివైజ్డ్ కాస్ట్ పేరుతో రూ.4 వేల కోట్లకు పెంచుకునే అవకాశలున్నాయని, ఇది టీజీ జెన్కో పాలిట శాపంగా మారుతుందని చెప్తున్నారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ నిబంధనను సవరించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.