హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి స్థల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఉద్యోగులు(బీఆర్‌ఏవోయూ) ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. స్థల కేటాయింపును నిరసిస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయించారు. శనివారం వర్సిటీ రిజిస్ట్రార్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు.
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన పదెకరాల స్థలాన్ని జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే జేఏసీగా ఏర్పడిన వర్సిటీ ఉద్యోగులంతా శనివారం మధ్యాహ్న భోజన సమయంలో వర్సిటీ పరిపాలన భవనం, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పల్లవి కాంబ్లే, సెక్రటరీ జనరల్ మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. భూకేటాయింపును తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీ పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సైతం భూ కేటాయింపును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.