హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనాన్ని నిరసిస్తూ బ్రాహ్మణులు పోరుబాట పడుతున్నారు. ఇందిరాపారు వద్ద మంగళవారం ‘తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష’ తలపెట్టినట్టు తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక తెలిపింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రస్తుత చైర్మన్, వైస్చైర్మన్లు బాధ్యతారాహిత్యంతో పరిషత్‌ను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ప్రతినిధులు యజ్ఞం పవన్‌కుమార్‌శర్మ, రమణారావు, రామారావు, ప్రసాద్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.
తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని సోమవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హయాంలో బ్రాహ్మణ సం క్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేశారని ప్రతినిధులు గుర్తుచేశారు. అయితే, తమ సమస్యలను నిలదీసిన వారిని, పరిషత్ పనితీరును ప్రశ్నించిన ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.