హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రవేశాల్లో స్థానిక విద్యార్థులకు 25% రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, రిజిస్ట్రార్ దేవేశ్నిగమ్కు వినోద్‌కుమార్ బృందం వినతిపత్రం అందజేసింది. తెలంగాణ విద్యా అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-ఈ కింద స్థాపించిన ఏకైక కేంద్ర విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ అని గుర్తుచేశారు. 1969లో తెలంగాణ తొలి ఉద్యమం తర్వాత ఆరు సూత్రాల పథకంలోని ఆర్టికల్స్ 371-డీ, 371-ఈలను రాజ్యాంగంలో చేర్చినట్టు తెలిపారు. తొలిదశ ఉద్యమంలో 360 మంది విద్యార్థులు, యువత ప్రాణాలు కోల్పోయార ని పేర్కొన్నారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీల్లో ఇప్పటికే స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయయని, ఇక్కడ కూడా అమలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టంచేశారు. రాష్ట్ర సామాజిక-విద్యా వాస్తవాలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వినోద్‌కుమార్ వెంట బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, విద్యార్థి నాయకుడు విశాల్, హెచ్‌సీయూ ఇన్చార్జి అభినేశ్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ కిరణ్‌కుమార్, మురళీయాదవ్ ఉన్నారు.