హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement ) బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన విద్యాసంస్థల నిరవధిక బంద్ విజయవంతమైందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) ప్రకటించింది. మొదటిరోజు 2,500 కాలేజీలు బంద్ పాటించినట్టు ఫతి చైర్మన్ రమేశ్‌బాబు తెలిపారు. బకాయిలు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మంగళవారం నుంచి అన్ని రకాల పరీక్షలను బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియాతో రమేశ్‌బాబు మాట్లాడారు.
సర్కారు దిగొచ్చే వరకు బంద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల విషయంలో సర్కారు దిగొచ్చే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని రమేశ్‌బాబు వెల్లడించారు. రూ.300 కోట్లు విడుదల చేస్తామని బంద్‌ను విరమించాలని ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరిపిందని, తాము అంగీకరించలేదని చెప్పారు. ఆఖరుకు రూ.900 కోట్లు ఇచ్చినా తాము ఒప్పుకోబోమని, సమ్మెను కొనసాగిస్తామని, 50% బకాయిలు విడుదల చేసే వరకు బంద్ జరుగుతుందని స్పష్టంచేశారు. ఈ నెల 8న 30 వేల మంది అధ్యాపకులు, సిబ్బందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ, 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.

ప్రభుత్వమే బెదిరింపులకు దిగడమా?
బకాయిలు అడిగినందుకు విజిలెన్స్ పేరిట ప్రభుత్వమే బెదిరింపులకు దిగడమేమిటని రమేశ్‌బాబు ప్రశ్నించారు. తనిఖీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. బెదిరింపు ధోరణి సరికాదని, కాలేజీలను లొంగదీసుకునే ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్ డబ్బులే ఇవ్వనప్పుడు అక్రమాలు, దుర్వినియోగం ఎక్కడిదని ప్రశ్నించారు. పర్సంటేజీలు తీసుకుని కొన్ని కాలేజీలకు రూ.వందల కోట్లు విడుదల చేయడంలో అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఫతి వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, ఫ్యాకల్టీ రాష్ట్రం దాటి వెళ్తున్నారని చెప్పారు. సమావేశంలో ఫతి ప్రతినిధులు కేఎస్ రవికుమార్, సునిల్, కొడాలి కృష్ణారావు, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.