Boyalapally Rekha : కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టిన “ అవినీతి, తీవ్రమైన నేరారోపణతో అరెస్టైన రాజకీయనేతల పదవి తొలగింపు బిల్లు”పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ బిల్లు అసలైన ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదని, ప్రతిపక్ష నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడమే అసలైన లక్ష్యమని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapally Rekha) మండిపడ్డారు.
బిల్లులోని “30 రోజుల నిర్బంధం ఉంటేనే పదవి తొలగింపు” అనే నిబంధన న్యాయవ్యవస్థను మించిన శిక్ష విధానంగా మారుతుందని రేఖ అన్నారు. ‘నేరం రుజువు కాకముందే.. ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను, మంత్రులను, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి పలు దర్యాప్తు సంస్థలను రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు బీజేపీ అస్త్రాలుగా ఉపయోగిస్తోంది.
ఇప్పుడు ఈ అవినీతి, నేరమయ రాజకీయనేతల బిల్లుతో అధికార దుర్వినియోగానికి న్యాయపరమైన కవచం ఇస్తున్నారు మోడీ, అమిత్ షా. ప్రజలు ఎన్నుకున్న నాయకులను కేవలం 30 రోజుల నిర్బంధం ఆధారంగా పదవి నుంచి తొలగించడం అనేది ఓటర్ల తీర్పును అవమానపరచడమే. ఇది అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం కాదు. బీజేపీని ప్రశ్నించే.. వాళ్ల విధానలను వ్యతిరేకించే నాయకులపై దాడికి రూపొందించిన ప్రతీకార ఆయుధం’ అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) బీజేపీ కుటిల నీతిని సరిగ్గా ఎత్తిచూపారు.
కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నది ఏమిటంటే – ‘మోడీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే అవినీతి వ్యతిరేక పోరాటాన్ని తమ కూటమి పార్టీలోని, తమ సొంత పార్టీలోని అవినీతిపరులపై మొదలు పెట్టాలి. న్యాయస్థానం తీర్పు వెలువరించేంత వరకూ ఎవరినీ దోషులుగా ప్రకటించరాదు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ఈ తరహా బిల్లులను కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తోంది’ అని బోయలపల్లి రేఖ స్పష్టం చేశారు.