మహబూబ్‌నగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు మరియమ్మ.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలం పెద్ద ధన్వాడ. గ్రామ సమీపంలో ఏర్పాటవుతున్న ఇథనాల్ కంపెనీ వద్దని ధర్నా చేయడానికి వెళ్లగా అక్కడున్న గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయెల్స్ అల్లాయిడ్ ఇండస్ట్రీకి చెందిన బౌన్సర్లు ఆమెపై కర్రలతో కొట్టడంతో తలపై బలమైన గాయమైంది.
రక్తం కారుతున్నా ఒక్క పోలీస్ కూడా కనికరించలేదు. తలపై గాయంతో చీరకొంగు కప్పకొని రక్తస్రావాన్ని ఆపు తూ హుటాహుటిన గద్వాల ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చింది. ఇప్పటికీ గాయం అలాగే ఉన్నది. తనపై కంపెనీ ప్రతినిధులు దాడిచేశారని గురువారం రాజోళి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఎస్సై జగదీశ్వర్ మాత్రం ‘కేసు గీస్ జాన్తానై’.. అంటూ ఉల్టా బెదిరించి పంపించారు.
విచిత్రం ఏమిటంటే కంపెనీ సిబ్బందికి చిన్న గాయం కాకున్నా.. ప్రజలు అక్కడి టెంట్లపై.. కంటైనర్‌పై.. దాడి చేస్తే తమపై హత్యాయత్నం చేశారని రైతులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఎస్సై 17 సెక్షన్లతో కేసు నమోదుచేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అదే పేద మహిళ తనపై దాడి చేసింది కంపెనీ వాళ్లే అని గాయం చూపించినా ఫిర్యాదు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. పోలీసు యంత్రాంగం కంపెనీకి కొమ్ముకాస్తున్నారు.. అనడానికి ఈ ఘటనే నిదర్శనమని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.