Gulzar House Fire Accident | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ‘రెండేండ్ల చిన్నారి ప్రమాదంలో చనిపోయింది. సమాధి చేసి వచ్చినం. మా జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉన్నదా? మేం బతికుండి ఎందుకు? ఈ యాక్సిడెంట్లో పదిహేడుమందిని కోల్పోయినం. అందరూ మా కుటుంబసభ్యులే.. మా సొంత సోదరి సచ్చిపోయింది. చిన్నచిన్న పిల్లలు సచ్చిపోయిండ్రు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిప్పుడు కాపాడేందుకు లోకల్ వాళ్లు అందరూ వచ్చిండ్రు. ఫైర్ ఇంజిన్లు వచ్చినయ్. కని వాటిలో నీళ్లు లేవు.. లోపలికి వెళ్లి కాపాడాలంటే మాస్కులు లేవని ఫైర్ సిబ్బంది చెప్పిండ్రు. ఇంత కంటే దారుణం ఉంటదా సార్!’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద మృతుల బంధువు రాహుల్ అగర్వాల్ తన ఆవేదన చెప్పుకొచ్చాడు.
సమయానికి సరైన సహాయం అంది ఉంటే ఇంకొంతమంది ప్రాణాలైనా దక్కేవని, చిన్నారులు చచ్చిపోయారంటూ బోరుమన్నాడు. ఫైర్ సిబ్బంది తమకు గ్లౌజులు లేవని, గాగూల్స్ లేవని చెప్పారని, అవేవీ లేకుండా లోపలికెలా వెళ్లాలని అడిగారని వాపోయాడు. ప్రమాదం జరిగిన తీరు, చనిపోయినవారి వివరాలను కేటీఆర్ తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు.